టొరంటో: ఫిఫా వరల్డ్ కప్‌లో జర్మనీ నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్–ఈ మ్యాచ్‌లో 2–1 తేడాతో ఐవరీ కోస్ట్‌పై విజయం సాధించింది. సెకండాఫ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన డెనిజ్ ఉందావ్ (68, 90+4వ ని) రెండు గోల్స్ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. నదీమ్ అమిరి దూరం నుంచి పంపిన బంతిని స్ట్రయికర్ కై హోవెర్జ్ వదిలేయగా, పక్క నుంచి దూసుకొచ్చిన ఉందావ్ దాన్ని గోల్‌గా మలిచాడు.
అమిరి, ఉందావ్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన ఎనిమిది నిమిషాలకే ఈ గోల్‌ను కొట్టారు. ఇక స్టాపేజ్ టైమ్ నాలుగో నిమిషంలో ఫెలిక్స్ మెచా అందించిన పాస్‌ను ఉందావ్ నేర్పుగా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. మ్యాచ్ 30వ నిమిషంలో ఐవరీ కోస్ట్ కెప్టెన్ ఫ్రాంక్ కేసీ తొలి గోల్ కొట్టాడు. మిడ్‌ఫీల్డర్ యాన్ డియోమాండే పంపిన క్రాస్‌ను ఫార్వర్డ్ ఆటగాడు అమాద్ డియాలో గోల్ వైపు కొట్టగా, జర్మనీ డిఫెండర్ నథానియల్ బ్రౌన్ అడ్డుకున్నాడు. అయితే ఆ బంతి తిరిగి కేసీ వద్దకు రావడంతో ఆయన సులువుగా నెట్‌లోకి పంపాడు.
తొలి అర్ధభాగంలో జర్మనీ చేసిన రెండు గోల్స్ ఫౌల్స్ అయ్యాయి. 21వ నిమిషంలో ఐవరీ కోస్ట్ కీపర్ ఫోఫానా చేతుల్లోంచి బంతి నెట్‌లోకి వెళ్లినప్పటికీ, జర్మనీ మిడ్‌ఫీల్డర్ అలెగ్జాండర్ పావ్లోవిచ్ కీపర్‌ను అక్రమంగా నెట్టడంతో ఆ గోల్‌ను అంపైర్ తిరస్కరించాడు. అలాగే 38వ నిమిషంలో జమాల్ ముసియాలా ఫౌల్ చేయడంతో హావెర్జ్ చేసిన మరో గోల్ కూడా నమోదు చేయలేదు.
కురసావ్ కేక..
కాన్సాస్ సిటీ: గోల్ కీపర్ ఎలోయ్ రూమ్ వీరోచిత పోరాటంతో కరీబియన్ దేశం కురసావ్.. వరల్డ్ కప్‌లో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. ఈక్వెడార్ జట్టు నిరంతరం చేసిన దాడులను సమర్థంగా తిప్పి కొడుతూ ఏకంగా 15 గోల్స్‌ను అడ్డుకుంది. దాంతో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0–0తో డ్రా అయ్యింది.
వరల్డ్ కప్‌లో కురసావ్‌కు ఇదే తొలి పాయింట్. ఈక్వెడార్ ప్లేయర్లు గోల్ కోసం చేసిన 27 ప్రయత్నాల్లో 15 షాట్లను ఎలోయ్ ఒంటరిగా అడ్డుకున్నాడు. 90 నిమిషాల ఆటలో ఇన్ని సేవ్స్ చేసిన ఏకైక కీపర్‌గా ఎలోయ్ రికార్డులకెక్కాడు. -2014లో అమెరికా కీపర్ టిమ్ హోవార్డ్ బెల్జియంపై 16 సేవ్స్ చేసినప్పటికీ, అందుకు అదనపు సమయం (120 నిమిషాలు) తీసుకున్నాడు.
జపాన్ బోణీ..
మాంటెర్రీ: స్టార్ ప్లేయర్ అయాస్ ఉయోదా (31, 83వ ని) రెండు గోల్స్‌తో చెలరేగడంతో.. గ్రూప్–ఎఫ్ మ్యాచ్‌లో జపాన్ 4–0తో ట్యూనీసియాపై గెలిచి బోణీ చేసింది. వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో జపాన్‌కు ఇదే అతిపెద్ద విజయం. మెగా టోర్నీలో ఇది 1000వ మ్యాచ్ కావడం గమనార్హం.
ఇక వరుసగా రెండు ఓటములతో ట్యూనీసియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ 4వ నిమిషంలో కేతో నకమురా అందించిన క్రాస్‌ను దైచీ కమాడ నెట్‌లో పంపాడు. జపాన్ వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన గోల్ ఇది. జున్యా ఇతో (69వ ని) జపాన్‌కు మరో గోల్ అందించాడు.
