
ప్రాక్టీసు వదిలేసి పార్ట్ టైం ఉద్యోగాల వైపు..
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్‌కు చెందిన రాధ. దంత వైద్యురాలు. కానీ వృత్తిని వదిలేసి టీచర్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండే హసన్ అహ్మద్ కూడా డెంటిస్టే. ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్స్ మేనేజర్‌గా చేస్తున్నారు. మరో డెంటిస్ట్ మహేశ్ ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో డెంటిస్ట్‌గా చేస్తూనే జీతం చాలక మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పార్ట్ టైం జాబ్ వెతుక్కున్నారు. ఈ ముగ్గురే కాదు. రాష్ట్రంలోని వేలాది మంది డెంటిస్టులది ఇదే పరిస్థితి. ప్రాక్టీస్‌తో వచ్చే జీతం చాలక వృత్తిని వదిలేయడమో, పార్ట్ టైం జాబు చేయడమో తప్పట్లేదు.
జీతం రూ. 10 వేల నుంచి 15 వేలే
రాష్ర్టంలోని 15 వేల మంది డెంటిస్టుల్లో 5 వేల మందికి కూడా సొంత క్లినిక్‌లు లేవు. చాలా మందికి క్లినిక్ పెట్టే స్తోమత లేదు. ప్రభుత్వ దవాఖానాల్లో పని చేద్దామంటే వందలోపే దంత వైద్య పోస్టులున్నాయి. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. డిమాండ్ తక్కువగా ఉండటంతో అక్కడ ఫ్రెషర్స్‌కు రూ.10- వేల – 15 వేలకు కన్నా ఎక్కువ జీతం ఇవ్వడం లేదు. జీతం చాలక డెంటిస్టులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, ఫార్మా కంపెనీల్లో, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొంత మంది ప్రాక్టీస్ చేస్తూనే మెడికల్ రిప్రజెంటేటివ్‌గా, క్యాబ్ డ్రైవర్లుగా, మెడికల్ కాల్ సెంటర్లలో పార్ట్ టైం జాబులు చేస్తున్నారు.
ఏటా వెయ్యి మందికి పైగా..
రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి 1,200లకు పైగా బీడీఎస్ సీట్లున్నాయి. ఏటా వెయ్యి మంది దంత వైద్యులు బయటకొస్తున్నారు. వీరందరికీ ఉపాధి దొరకడం కష్టమైంది. జాబొచ్చినా చాలీచాలని జీతం. దీంతో పట్టా వచ్చిన రెండు, మూడేండ్లలోనే చాలా మంది డెంటిస్ట్ వృత్తిని వదిలేస్తున్నారు. 1,200 లకు పైగా బీడీఎస్ సీట్లుంటే 250 లోపే ఎండీఎస్ (స్పెషలైజేషన్) సీట్లు ఉన్నాయి. ఈ స్పెషలైజేషన్ చేసిన వారి పరిస్థితి మాత్రం కాస్త మెరుగ్గా ఉంది. వాళ్ల ప్రారంభ వేతనం రూ.30 వేలు, 40 వేలతో మొదలవుతోందని సీనియర్ డాక్టర్లు చెబుతున్నారు. డెంటిస్టులకు ప్రభుత్వ దవాఖాన్లలో దంత వైద్య పోస్టులు పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎంబీబీఎస్ వైద్యుల్లానే తమకూ పీహెచ్‌సీల్లో పని చేసేందుకు చాన్స్ ఇవ్వాలని డెంటిస్టులు డిమాండ్ చేస్తున్నారు.
ఏడాదైనా పని దొరుకుతుందని
సీఎం కేసీఆర్ ప్రకటించిన దంత కాంతి కార్యక్రమం కోసం ప్రజల కన్నా దంత వైద్యులే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓ ఏడాదైనా ఉపాధి దొరుకుతుందని వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏడాదిగా కార్యక్రమం మొదలవకపోవడంతో నిరాశలో ఉన్నారు.
సర్కారు పట్టించుకోవట్లే
– డాక్టర్ ప్రియాంక
డెంటిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
టౌన్ల వైపు వెళ్లాలె
– డాక్టర్ వికాస్ గౌడ్
సీనియర్ దంత వైద్య నిపుణులు