డీఈఓ, ఎంఈఓలు వేధించారంటూ..

డీఈఓ, ఎంఈఓలు వేధించారంటూ..
  • సాక్షాధారాలతో మహిళా టీచర్ విజయరాణి పోరాటం.. స్పందించిన ఏపీ విద్యాశాఖ 
  • విచారణకు డీఈఓ తరపున అడిషనల్ డైరెక్టర్, ఎంఈఓ,స్కూల్ యాజమాన్యం  హాజరు
  • ఆరోపణలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలింది: కడప RJD వెంకటకృష్ణా రెడ్డి

అమరావతి: తనకంటే జూనియర్ అయిన మహిళా టీచర్ కు తనపై అజమాయిషీ చెలాయించే హెడ్మాస్టర్ బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఒక మహిళా టీచర్ చేసిన పోరాటం విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టించింది. ఉన్నతాధికారులే ఆమె వద్దకు దిగివచ్చి విచారణ చేపట్టారు. వేధింపులకు గురిచేసిన సాటి ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యంతోపాటు.. వారికి వత్తాసు పలికిన మండల విద్యాధికారి, డీఈఓ తరపున అడిషనల్ డైరెక్టర్ విచారణకు హాజరైన అరుదైన ఘటనకు కర్నూలు జిల్లా నంద్యాల వేదిక అయింది. వివరాలు ఇలా ఉన్నాయి.
నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ మోడల్ ప్రైమరీ ఎయిడెడ్ స్కూల్ లో విజయరాణి అనే మహిళా టీచర్ పనిచేస్తున్నారు. ఈమెను స్కూల్ యాజమాన్యం పలుమార్లు వేధించింది. చివరకు హెడ్మాస్టర్ పోస్టు ఖాళీ అయితే విజయరాణి కంటే జూనియర్ అయిన టీచర్ కు హెడ్మాస్టర్ బాధ్యతలు అప్పగించారు. ఇదేమి న్యాయమంటూ విజయరాణి ప్రశ్నించగా.. వేధింపులు మరింత తీవ్రం చేశారు. అంతేకాదు నువ్వు అవసరం లేదు అంటూ స్కూల్ లోనికి రానివ్వకుండా బహిరంగంగా అందరిముందు అడ్డుకుని అవమానించారు. సాటి టీచర్లను వెంటబెట్టుకుని స్కూల్ విధులకు వస్తే హాజరుపట్టీలో సంతకం చేయనీయకుండా అడ్డుకున్నారు. తనను ఉద్దేశ పూర్వకంగానే వేధింపులకు గురిచేస్తున్నారని విజయరాణి ఫిర్యాదు చేయగా.. అప్పటి మండల విద్యాధికారి బ్రహ్మం విచారణకు వచ్చి వెళ్లారు. ఎంఈఓ కూడా స్కూల్ యాజమాన్యానికే వత్తాసు పలకడంతో బాధితురాలు జిల్లా డీఈఓ సాయిరామ్ కు ఫిర్యాదు చేయగా.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఆయన కూడా కొద్ది రోజుల తర్వాత మొహం చాటేశారు. ఎలాంటి ఒత్తిళ్లు పనిచేశాయో గాని విజయరాణి ప్రతిరోజు స్కూల్ వెళ్తున్నా వెళ్లలేదని డీఈఓ సాయిరామ్ తప్పుడు నివేదికలు సమర్పించారు. 
5 నెలల జీతం నిలిపేసి వేధించారు

జిల్లా విద్యాధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎస్జీటీగా పనిచేస్తున్న విజయరాణికి 5 నెలలు జీతం ఆగిపోయింది. మండల, జిల్లా స్థాయి అధికారుల అండతో వాస్తవాలు దాచి తప్పుడు నివేదికలు పంపి మోసాలకు పాల్పడి అవమానించారు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు కె.సతీష్ కుమార్ ఆయన సహచరుల సహకారంతో పోరాటం కొనసాగించారు విజయరాణి. తనపై జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పుడు నివేదికలను సమాచార హక్కు చట్టం కింద సంపాదించారు. సహచర సిబ్బంది మొదలు ఎంఈఓ, డీఈఓ కూడా వాస్తవాలు దాచినట్లు సహ చట్టం కింద ఆధారాలన్నీ సేకరించి గత నెల 20న ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ కమిషనర్ లకు ఆధారాలతో ఫిర్యాదు చేయడం వల్లే విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారని బీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కె. సతీష్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్య కమిషనర్ కడప ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డిని విచారణ అధికారిగా నియమించగా ఆయన బుధవారం నంద్యాలకు వచ్చి ఎమ్మార్సీ (MRC) భవన్ లో విచారణ చేపట్టారు. బాధితురాలు విజయరాణి, ఆమె తరపున బీటీఎఫ్ అధ్యక్షులు కె. సతీష్ కుమార్ విచారణకు హాజరుకాగా డీఈఓ సాయిరామ్ బదిలీపై వెళ్లిపోవడంతో ఆయన ప్రతినిధిగా కర్నూలు డీఈఓ ఆఫీస్ నుండి అడిషనల్ డైరెక్టర్ సామేల్ పాల్, ఎంఇఓ బ్రహ్మం, టీచర్ కెనడి, స్కూల్ యాజమాన్యం హాజరయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఈఓ సాయిరాం విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన లేకుండా విచారణ ఎలా కొనసాగిస్తారని ఆర్జేడీని ప్రశ్నించగా డీఈఓ ఆఫీస్ ఫైల్స్ పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకుంటామని ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి చెప్పారు. టీచర్ విజయరాణిని వేధించినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిందని, విద్యాశాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 
అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి
అకారణంగా జీతాలు నిలిపివేసి వేధింపులకు గురిచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన  డీఈఓ సాయిరాం, ఎంఇఓ బ్రహ్మం  జీతాల నుండి రికవరీ చేసి విజయరాణి టీచర్ కు పెండింగులో ఉంచిన జీతాలు చెల్లించాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తామని రెండేళ్లుగా చెబుతున్నా.. అధికారులు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీలనే తూట్లు పొడిచేవిధంగా వ్యవహరిస్తున్నట్లు ఆధారాలతో సహా తేలినా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం తగదని అన్నారు. నాడు-నేడు అని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యాశాఖ ఉన్నతాధికారులదేనని ఆయన పేర్కొన్నారు.