ర్యాగింగ్​తో విద్యార్థుల్లో కుంగుబాటు

ర్యాగింగ్​తో విద్యార్థుల్లో కుంగుబాటు

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 23వ తేదీన ర్యాగింగ్ జరిగిందని వెల్లడైంది. విద్యాలయాల్లో ర్యాగింగ్ గురించి పూర్వాపరాలు పరిశీలిస్తే..కొత్తగా కాలేజీలో  చేరిన విద్యార్థులతో స్నేహాన్ని బలపరుచుకునేందుకు మొదలైన ఈ విధానం ప్రస్తుతం అనర్థదాయకంగా మారింది. సాటి విద్యార్థి మానసికంగా కుంగిపోయి చనిపోయేవిధంగా ర్యాగింగ్ హింసాత్మకంగా మారింది. చాలా సంవత్సరాలుగా ర్యాగింగ్ వందలాది మంది అమాయక విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వేలాది మంది తెలివైన విద్యార్థుల కెరీర్‌‌‌‌ను నాశనం చేసింది. 1999లో విశ్వ జాగృతి విషయంలో సుప్రీంకోర్టు ర్యాగింగ్‌‌‌‌ను ఇలా నిర్వచించింది, 

‘నిందించినా లేదా రాసిన మాటల ద్వారా ఇతర విద్యార్థిని ఆటపట్టించడం, ప్రవర్తించడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం,  క్రమశిక్షణ రాహిత్యం వంటి ప్రభావంతో కూడిన ఏదైనా క్రమరహిత ప్రవర్తన’ అని పేర్కొంది.  70వ దశకం చివరిలో ఒక ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాలలో ఇద్దరు ఫ్రెషర్లు మరణించిన తరువాత భారత ప్రభుత్వం దేశంలో ర్యాగింగ్‌‌‌‌ను నిషేధిస్తూ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. ‘అందరూ ఒకే విధమైన మనస్తత్వంతో ఉండరని, కొందరు అత్యంత సున్నిత మనస్కులై, చిన్నపాటి విషయాలకే ఉద్రేకానికి గురవుతుంటారు’ అని న్యాయమూర్తులు మార్కండేయ ఖట్జూ, ఏకే గంగూలీ అభిప్రాయపడ్డారు. ర్యాగింగ్‌‌‌‌ను అరికట్టేందుకు విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకాలను జారీ చేయాలని సుప్రీంకోర్టు 1999లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్​ను కోరింది. 

ర్యాంగింగ్​కు పాల్పడితే జీవితఖైదు

ర్యాగింగ్​కు వ్యతిరేకంగా జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిజిస్ట్రార్,  ప్రొఫెసర్ కేపీఎస్ ఉన్ని ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల కమిటీని యూజీసీ ఏర్పాటు చేసింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్‌‌‌‌పై చట్టాలు తీసుకురావాలని ఈ కమిటీ  నివేదించింది. ర్యాగింగ్​కు పాల్పడినవారి అడ్మిషన్ రద్దు నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే వరకు శిక్షలు విధించాలని సూచించారు. ర్యాగింగ్‌‌‌‌కు వ్యతిరేకంగా సున్నితత్వం కోసం చేపట్టాల్సిన పలు చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. ర్యాగింగ్‌‌‌‌ను అరికట్టడంలో విఫలమైన సంస్థలను మూసేయ్యాలని కూడా కమిటీ సభ్యులు సూచించారు. 2006లో  సుప్రీంకోర్టు తన మునుపటి మార్గదర్శకాల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ర్యాగింగ్ సమస్య మరోసారి తెరపైకి తెచ్చింది. 

ర్యాగింగ్‌‌‌‌ను నిరోధించడానికి మార్గాలు, పద్ధతులను సూచించడానికి సీబీఐ డైరెక్టర్ డాక్టర్  రాఘవన్ ఆధ్వర్యంలో మరొక కమిటీని ఏర్పాటు చేసింది. పాఠశాల దశ నుంచే మానవీయ విలువలను పెంపొందించడంలో మన వైఫల్యమే ర్యాగింగ్‌‌‌‌గా పేర్కొంది. క్యాంపస్‌‌‌‌లలో ర్యాగింగ్ కేసుల పెరుగుదల సమస్యను పరిష్కరించడానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్  ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్ ముప్పును అరికట్టడానికి కొన్ని నిబంధనలను 2009లో తీసుకువచ్చింది. ఈ నిబంధనలను అన్ని ఉన్నత విద్యా సంస్థలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ర్యాగింగ్ చేసినవారు దోషులుగా తేలితే వారిపై తీసుకోవలసిన చర్యలను సూచించింది.  ఒక విద్యార్థిని ర్యాగింగ్ ద్వారా అవమానించి బాధించడం జరిగితే 6 నెలల వరకు జైలు శిక్ష, వెయ్యి రూపాయల వరకు జరిమానా విధింపబడుతుందని పేర్కొంది. ర్యాగింగ్ సందర్భంలో విద్యార్థి మరణించినా లేదా ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినా నేరస్థులకు జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలుశిక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. 

టోల్​ ఫ్రీ హెల్ప్​లైన్​ 

ర్యాగింగ్ బాధితులకు సహాయం చేయడానికి యూజీసీ 12 భాషలలో 1800-180-5522 యాంటీ ర్యాగింగ్ టోల్-ఫ్రీ హెల్ప్‌‌‌‌లైనుని  ఏర్పాటు చేసింది. 

- డి జె మోహన రావు, అధ్యాపకుడు