ఒత్తిళ్లకు దూరంగా…రీచార్జ్ చేస్తది..!

ఒత్తిళ్లకు దూరంగా…రీచార్జ్ చేస్తది..!

మాటలు ఉండవు. మాట్లాడుకోవడమూ ఉండదు. సెల్ ఫోన్లు అసలే ఉండవు.. మౌనమే ఒక మంత్రం. అక్కడ టీవీలు, కంప్యూటర్లు లాంటివి కనిపించవు. ఒక్కమాటలో చెప్పాలంటే బాహ్య ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మనసులకు మానసిక ప్రశాంతతను అందిస్తది సంగారెడ్డి జిల్లాలోని విపశ్యన ధ్యాన కేంద్రం. పదిరోజుల శిక్షణలో ఒత్తిడితో చిత్తవుతున్న మనసులను రీచార్జ్ చేస్తది.

విపశ్యన పురాతనమైన ధ్యాన పద్ధతి. విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఇది ఒక స్వయం పరిశీలన  ప్రక్రియ. ప్రత్యక్షానుభూతితో సత్యాన్ని దర్శించడం, మనసును నిర్మలం చేసుకోవడం విపశ్యన విధి. నిర్వాణం, ముక్తి వంటి ఆధ్యాత్మిక లక్ష్య సాధన కోసమే విపశ్యన ధ్యాన కేంద్రం ఏర్పడింది. శాస్త్ర , సాంకేతిక రంగాల్లో  సాధించిన అభివృద్ధి కారణంగా మానవ జీవితాలు ఒత్తిడి, అలజడి మధ్య నలుగుతున్నాయి. మనసుకు గొప్ప ఉత్తేజం అందించడమే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలు ఇస్తోంది.

పదిరోజులు మౌనం

సంగారెడ్డి జిల్లా కొండాపూర్​లో ‘దమ్మకొండన్న’ పేరుతో  ఈ విపశ్యన ధ్యాన కేంద్రం ఉంది. పదిరోజుల పాటు శిక్షణ ఉంటుంది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ధ్యాన ప్రక్రియ ముగుస్తుంది. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు శిక్షణ ఉంటుంది. శిక్షణ మొదటిరోజు నుంచి చివరిరోజు వరకు మౌనం పాటించాలి. సెల్​ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, న్యూస్​పేపర్లకు దూరంగా ఉండాలి. ట్రైనర్స్​కి ప్రత్యేక గదులు ఉంటాయి. మౌన దీక్షతోనే ఈ శిక్షణ ముగుస్తుంది.

క్రమశిక్షణతో

మనిషి దుర్బుద్ధి, అనైతికతను మార్చే శక్తి దీనికి ఉంది. చిత్తశుద్ధితో మార్పు కోరుకునేవాళ్లకి అవకాశం కల్పిస్తుంది.
సాధకుడు ఆచార్యుడి పట్ల, ధ్యాన పద్ధతి పట్ల క్రమశిక్షణతో ఉండాలి. మూడున్నర రోజుల పాటు ఆనపాన చేస్తారు. ఆరున్నర రోజుల పాటు విపశ్యన చేయిస్తారు. బుద్ధుడి కాలం నాటి ధ్యాన పద్ధతులను నేర్పిస్తారు.
ఆనపాన వల్ల  ఏకాగ్రత, మనసును వశపర్చుకోవడం వంటివి అబ్బుతాయి. శ్వాస మీద ధ్యాస లగ్నమయ్యేలా శిక్షణ ఉంటుంది.

పెద్దవాళ్ల సూచనతో..

విపశ్యన గురించి మా పెద్దవాళ్లు తరచుగా చెప్పేవాళ్లు. అందుకే నాకు ఈ కోర్సు చేయాలని అనిపించింది. అహంకారం, స్వార్థం లాంటి లక్షణాలను దూరం చేస్తుంది.  ధ్యానంతో మనం ఏంటో తెలుసుకోవచ్చు. నాలుగైదేళ్లుగా విపశ్యన సెంటర్​కు వస్తున్నా.

– మౌనిక, సాఫ్ట్​వేర్ ఇంజనీర్‍, పార్వతీపురం

ముక్తికి మార్గం

విపశ్యన ధ్యాన మార్గంతో  ముక్తిని పొందొచ్చు. మరణాన్ని కూడా ఆనందంగా  ఆహ్వానించగలిగే  స్థితికి చేర్చుతుంది ఈ ధ్యానం. ధ్యాన పద్ధతి అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. గృహస్తు జీవనం గడిపేవాళ్లు ఈ పద్ధతిలో ధ్యానం చేస్తే ఎలాంటి ఆందోళనలు దరిచేరవు.

– తిరుపతిరెడ్డి, గురూజీ

ఒత్తిడి దూరం

పదేళ్లుగా విపశ్యనకు వస్తున్నా. చాలా మార్పు వచ్చింది. గతంలో ప్రతి చిన్న విషయానికే కోపం, బాధ కలిగేది. ఇప్పుడు మానసిక ప్రశాంతత చాలా బాగుంది. జీవించే కళను, ప్రతిఒక్కరితో ఎలా మసులుకోవాలో నేర్పిస్తుంది. అందుకే ఏడాదికి ఒక్కసారి విపశ్యన ధ్యాన కేంద్రానికి వస్తుంటా.

– డాక్టర్​ నరేష్‍ కుమార్​ , నిజామాబాద్