- ఆయన సేవలను గుర్తించి కుమారుడికి ఉద్యోగం ఇచ్చాం: భట్టి
- కవులు, కళాకారులను మా ప్రభుత్వం గౌరవిస్తున్నది
- గత ప్రభుత్వం వాడుకుని వదిలేసిందని ఫైర్
- అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల సవరణ బిల్లు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు:‘జయజయహే తెలంగాణ’ గీతంతో తెలంగాణ ప్రజలను అందెశ్రీ ఏకం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందెశ్రీ సేవలను గుర్తించి, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. అనాథ అయిన అందెశ్రీ ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని గీత రచయితగా ఎదిగారని కొనియాడారు. శనివారం అసెంబ్లీలో తెలంగాణ పబ్లిక్‌సర్వీస్ నియామకాల క్రమబద్ధీకరణ, వేతన సవరణ బిల్లును భట్టి ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బడికి వెళ్లి చదువుకోకున్నా అందెశ్రీ అద్భుతమైన కవితలు రాశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తూ 2024 జూన్ 2న జీవో ఇచ్చాం. తెలంగాణకు అందెశ్రీ అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాం.
అందెశ్రీ కుమారుడు దత్తసాయిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించాం. 2025 నవంబర్ 25న ఆర్డినెన్స్ ద్వారా ఉద్యోగం ఇచ్చాం. ఇప్పుడు దాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం హర్షణీయం” అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కవులు, కళాకారులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక వాళ్లను ఎలా గౌరవిస్తున్నామో అందరికీ తెలుసునని అన్నారు.
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని వాడుకున్న పెద్దలు.. తెలంగాణ వచ్చాక అందెశ్రీని వదిలేశారు. మా ప్రభుత్వం వచ్చాకే దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. అందెశ్రీలాగే తెలంగాణ కోసం గద్దర్ ఎలా కష్టపడ్డారో అందరికీ తెలుసు. ఆయన తన జీవితాంతం ఆడిపాడి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాటి సీఎంను కలవడానికి గద్దర్ వెళ్తే.. గంటల తరబడి ఎండలో నిలబెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక గద్దర్‌కూ గౌరవం కల్పించాం” అని తెలిపారు.
అందెశ్రీ త్యాగం గొప్పది: సూర్యనారాయణ
అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగమివ్వడం అభినందనీయమని బీజేపీ ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ అన్నారు. ‘‘అందెశ్రీ త్యాగం గొప్పది.. ఆయన గళం చిరస్థాయిగా నిలిచిపోతుంది” అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిది. 350 నుంచి 400 మంది కళాకారులకు ఉద్యోగావకాశాలు కల్పించి ఆదుకోవాలి” అని కోరారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి: కూనంనేని సాంబశివరావు
రాష్ట్రంలో లక్షలాది మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ఉద్యోగులు ఉన్నారని.. వాళ్లను దశల వారీగా క్రమబద్ధీకరించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ‘‘గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం అభినందనీయం. అలాగే తెలంగాణ కళాకారులు, క్రీడాకారులు, ఇతర రంగాల్లో రాణిస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించాలి. వీళ్లకు ప్రత్యేక అవార్డులు ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వాళ్ల సమస్యలను పరిష్కరించాలి” అని డిమాండ్ చేశారు.
