హైదరాబాద్​ను ప్రపంచ సిటీగా తీర్చిదిద్దుతాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్​ను ప్రపంచ సిటీగా తీర్చిదిద్దుతాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • పాతబస్తీలో అగ్ని ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు
  • ఓల్డ్​ సిటీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్​ రివ్యూ

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌ మహానగరాన్ని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులనైనా వెచ్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఓల్డ్ సిటీ అభివృద్ధి పనులపై హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. చార్మినార్, మలక్‌పేట్, కార్వాన్, యాకుత్ పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా సమీక్షించి, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఓల్డ్​సిటీలోని వారసత్వ కట్టడాలను కాపాడుకుంటూనే, దాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామన్నారు. పాత నగరంలో అగ్నిప్రమాదాలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి బడ్జెట్‌లో 10 వేల కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఓల్డ్​సిటీ ఎమ్మెల్యేలు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.