ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీలు అందించాలి.. కంపెనీల ప్రతినిధులను కోరిన డిప్యూటీ సీఎం భట్టి

ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీలు అందించాలి.. కంపెనీల ప్రతినిధులను కోరిన డిప్యూటీ సీఎం భట్టి

పేదల సొంతింటి కల సాకారానికి సహకరించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో సిమెంట్, స్టీల్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. మంగళవారం సెక్రటేరియెట్ లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిమెంటు, స్టీల్ పరిశ్రమల యజమానులు, అధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించారు. 

రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి.. ఇప్పటికే రాష్ట్రంలో వేగంగా నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. మానవీయ కోణంలో ఆలోచించి ఇందిరమ్మ  ఇండ్ల నిర్మాణానికి స్టీలు, సిమెంటు ధరలు తగ్గించి అపార్ట్ మెంట్లు, విల్లాలకు ఏ విధమైన నాణ్యతతో సరఫరా చేస్తున్నారో అదే స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లకు కూడా అందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. 

రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలి: శ్రీధర్​బాబు

పేద కుటుంబాలకు సంబంధించిన ఇండ్ల స్కీమ్​పదేండ్ల తర్వాత రాష్ట్రంలో అమలవుతున్నదని, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై చేయూతనివ్వాలని సిమెంటు, స్టీలు పరిశ్రమల యజమానులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. చిన్న, పెద్ద అనే అంతరం లేకుండా కంపెనీలన్నీ ఒకే ధరకు సిమెంటు, స్టీలు సరఫరా చేయాలని సూచించారు. 

రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని.. దానిని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకు, నాణ్యతతో కూడిన సిమెంటు, స్టీలును సరఫరా చేయాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు సిమెంటు కంపెనీలు అందిస్తున్న ధరను సమావేశంలో మంత్రులు సమీక్షించారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, 27.75 లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు అవసరం అవుతుందని అధికారులు పరిశ్రమల యజమానులు, నిర్వాహకులకు వివరించారు. 

త్వరలో ధరలు ఫైనల్

ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సహకారం అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని సిమెంటు, స్టీలు కంపెనీల యజమానులు, ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వీలైనంత త్వరగా స్టీలు, సిమెంటు పరిశ్రమల యాజమాన్యాలు, ప్రతినిధులు సమావేశమై ధరలు ఫైనల్ చేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.