మాది ఓపెన్ పాలసీ..మీదే సీక్రెట్ డీలింగ్..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మాది ఓపెన్ పాలసీ..మీదే సీక్రెట్ డీలింగ్..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • బీఆర్ఎస్ భూబాగోతాలన్నీ బయటపెడ్తం: డిప్యూటీ సీఎం భట్టి
  • నాడు మీరే రహస్యంగా ల్యాండ్ కన్వర్షన్ చేశారు 
  • రాష్ట్ర అభివృద్ధి కోసమే హెచ్‌‌ఐఎల్‌‌టీ పాలసీతెచ్చామని వెల్లడి  
  • మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా: శ్రీధర్ బాబు 
  • ఒక్క పైసా అవినీతి లేదు: ఉత్తమ్ 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్‌‌కు రాకూడదనే, నగరాన్ని కాలుష్యకోరల నుంచి కాపాడాలనే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌‌ఐఎల్‌‌టీపీ)ని తీసుకొచ్చినట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. తాము గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ పాలసీని తేలేదని స్పష్టం చేశారు. 

కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హెచ్‌‌ఐఎల్‌‌టీ పాలసీపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, ఆదాయం, నగరాభివృద్ధే పరమావధిగా మేం ఈ పాలసీ తెచ్చాం. ఈ విధానం వల్ల ల్యాండ్ కన్వర్షన్ చార్జీల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నిర్మాణాల వల్ల జీఎస్టీ వస్తుంది. 

సిటీలో నివాస యోగ్యత పెరుగుతుంది. మీ (బీఆర్ఎస్) హయాంలో పాలసీ లేదు.. కేబినెట్ అప్రూవల్ లేదు. మీకు కావాల్సిన కొద్దిమందికి, పరిచయస్తులకు మాత్రమే గుట్టుచప్పుడు కాకుండా పర్మిషన్లు ఇచ్చారు. అందులో ఏం లావాదేవీలు జరిగాయో ఎవరికీ తెలియదు. కానీ మా ప్రభుత్వం అలా కాదు. 

మేం ఓపెన్ పాలసీ తెచ్చాం. మీ లెక్క సీక్రెట్ డీలింగ్ చేయడం లేదు. మా పాలసీని తప్పుబడుతున్న మీరు.. గతంలో ఏం చేశారో ఆ చిట్టా మొత్తం బయటపెడతాం. ఎవరెవరికి, ఎప్పుడు పర్మిషన్లు ఇచ్చారు? ఎంత ల్యాండ్ కన్వర్షన్ చేశారు? పాలసీ లేకుండా ఎలా ఇచ్చారు? అనే పూర్తి వివరాలు త్వరలోనే ప్రజల ముందుంచుతాం” అని భట్టి చెప్పారు.  

నాటి కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకే పాలసీ: శ్రీధర్ బాబు 

రాష్ట్ర అభివృద్ధి కోసం ల్యాండ్ కన్వర్షన్ పాలసీ తెచ్చా మని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తున్నదని మండిపడ్డారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబినెట్ సబ్ కమిటీ చేసిన సూచనలనే మేం పాటిస్తున్నాం. నాడు వాళ్లు చేస్తే పుణ్యం.. నేడు మేం చేస్తే పాపమా?” అని ప్రశ్నించారు. 

‘‘మీ ప్రభుత్వ (బీఆర్ఎస్) హయాంలో కేబినెట్ సబ్ కమిటీ 108, 22 జీవోలకు సంబంధించి ఏం చెప్పిందో తెలుసా.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డిటీసీపీ, ఐలా పరిధిలో ల్యాండ్ యూజ్ ఛేంజ్, ప్రాసెస్ ఫీజు, స్క్రూటినీ.. ఇలా అన్నీ ‘టీఎస్-ఐపాస్’ ద్వారానే జరగాలని తెలిపింది. 

అప్లికేషన్ పెట్టిన మూడ్రోజుల్లోనే ప్రక్రియ మొదలై 7 రోజుల్లోనే అనుమతులు ఇవ్వాలని మీ సబ్ కమిటీనే సూచించింది కదా? గతంలో మీరు రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ ద్వారా రూ.40 వేల కోట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అది మీకు పుణ్య కార్యక్రమం.. మేం అదే బాటలో రాష్ట్ర సంక్షేమం కోసం ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పు ఎలా అవుతుంది?’’ అని నిలదీశారు. 

‘‘మేం కొత్తగా నిబంధనలేవీ పెట్టలేదు. కొత్తగా ఏమీ యాడ్ చేయలేదు. ఆనాడు కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకే పాలసీ తెచ్చాం” అని స్పష్టం చేశారు.  

కేటీఆర్, హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలు: ఉత్తమ్ 

హైదరాబాద్‌‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకే కొత్త పాలసీ తెచ్చామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘‘ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. అవన్నీ పచ్చి అబద్ధాలు, అసత్యాలు. అందులో ఒక్క అక్షరం కూడా నిజం లేదు. కేబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘ చర్చలు, నిపుణుల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం.  

రిసోర్స్ మొబిలైజేషన్‌‌పై వేసిన కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి, నేను, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నాం. ఓఆర్‌‌ఆర్‌‌ పరిధిలోని ఇండస్ట్రియల్ భూముల అంశాన్ని మా కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి చేసిన సిఫార్సుల మేరకే ప్రభుత్వం పాలసీ తెచ్చింది. అందులో ఒక్క పైసా అవినీతి లేదు. కేటీఆర్, హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలు” అని మండిపడ్డారు.