రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీపై స్పెషల్ ఫోకస్... 2047 నాటికి ఉండే డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీపై స్పెషల్ ఫోకస్... 2047 నాటికి ఉండే డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో విద్యుత్ సబ్‌ స్టేషన్లకు శంకుస్థాపన

చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు, ఇందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని చిలుకూరు, నాగిరెడ్డిగూడ, నవాబ్‌పేట మండలంలోని నారేగూడెంలో రూ.20 కోట్లతో మంజూరైన మూడు 33/11 కేవీ విద్యుత్ సబ్‌ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.  

అనంతరం మొయినాబాద్ మండల రైతులకు 80 (25 కేవీ ) ట్రాన్స్ ఫార్మర్లు, లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి ఉండే విద్యుత్ డిమాండ్​కు అనుగుణంగా సోలార్, ఫ్లోటింగ్ సోలార్, హైడెల్, విండ్ ఎనర్జీ ద్వారా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. ఖాళీ ప్రభుత్వ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు, పరిశ్రమలకు గ్రీన్ ఎనర్జీ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 2,000 మెగావాట్లు పెరిగినప్పటికీ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 

ఇందుకు లైన్​మెన్ నుంచి ఎస్‌ఈ వరకు కార్మికుల కృషిని ప్రశంసిస్తూ, ప్రతి విద్యుత్ కార్మికుడికి కనీసం రూ.కోటి ఇన్సూరెన్స్ అందజేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరిన 132 కేవీ సబ్​స్టేషన్ శాంక్షన్ కోసం, విద్యుత్ అధికారులు డిమాండ్ అంచనా వేసి ప్రతిపాదనలు సమర్పిస్తే వెంటనే మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, సీఎండీ ముషారఫ్ అలీ, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.