పెట్టుబడులను ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు జరపాలి..అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

పెట్టుబడులను ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు జరపాలి..అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలన విజయోత్సవాలు(డిసెంబర్ 1 నుంచి 9 వరకు) పెట్టుబడులను ఆకర్షించేలా నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్​లో ప్రజా పాలన విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని ఎలా సాధించాం? కొత్త రాష్ట్రంలో ఎన్ని విజయాలు నమోదు చేశాం? భవిష్యత్తు లో తెలంగాణ రాష్ట్రం ఏం సాధించబోతుంది? అనే విషయాలను ప్రపంచానికి వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.

 పెట్టుబడిదారులను ఈ విజయోత్సవానికి ఆహ్వానిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున ఎంఓయూలు జరిగేలా చూడాలన్నారు. ఫ్యూచర్ సిటీలో కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేయాలని స్పష్టం చేశారు. సీనియర్ , జూనియర్ అధికారులతో కలిపి కమిటీలు వేయాలని..అనుకున్న ప్రణాళికను అమలు చేసేలా ముందుకు వెళ్లాలని చెప్పారు. హైదరాబాద్ సిటీ, మూసీ పునర్జీవనం, ఫ్యూచర్ సిటీ, ఇప్పటికే అనేక పరిశ్రమలను తెలంగాణ ఆకర్షిస్తుందన్నారు. భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతుందో ఈ వేడుకల్లో ప్రపంచానికి చూపించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.