సోలార్ పవర్‌‌ను వాడుకలోకి తేవాలి : డిప్యూటీ సీఎం భట్టి

సోలార్ పవర్‌‌ను వాడుకలోకి తేవాలి : డిప్యూటీ సీఎం భట్టి
  •     ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌‌, వెలుగు: భవిష్యత్తు విద్యుత్‌‌ అవసరాలకు అనుగుణంగా సోలార్ పవర్​ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జలాశయాలపై సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అదే విధంగా అన్ని గవర్నమెంట్‌‌ ఆఫీసుల బిల్డింగ్‌‌లపై సోలార్ రూఫ్​ టాప్ సిస్టం ఏర్పాటు చేసుకునేలా ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు.

శుక్రవారం సెక్రటేరియెట్ లో రెడ్కో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సోలార్, విండ్, హైడ్రోజన్, పంప్డ్  స్టోరేజ్ లాంటి టెక్నాలజీ పాలసీలతో పాటు పెండింగ్‌‌లో ఉన్న అన్నింటినీ పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌‌ కోసం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీల పై అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్, విద్యుత్ తయారీ పనులు, భవిష్యత్తు ప్రణాళికలపైనా ఆరా తీశారు.