
- పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా కరెంట్ ప్రాబ్లమ్
- ఉండదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- పేదలు, మధ్యతరగతి వాళ్లకు బ్యాంకర్లు లోన్లు ఇవ్వాలి
- పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్.. ట్రిపుల్ఆర్
- నిర్మాణంతో మరింత అభివృద్ధి
- ఏటా మహిళా సంఘాలకు20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
- రూ.6.33 లక్షల కోట్లతో వార్షికరుణ ప్రణాళిక
హైదరాబాద్, వెలుగు: త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు అందుబాటులో ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంట్ సరఫరా చేస్తామని తెలిపారు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ఆయన కోరారు. రుణాలు పెంచడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని, బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది.
ఈ సందర్భగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ఆయన 2024–25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లపాటు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని వెల్లడించారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఐదు లక్షల ఇండ్ల నిర్మించాలనే ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు.
బ్యాంకర్లకు పాజిటివ్ దృక్పథం ఉండాలి
సబ్సిడీ పథకాలకు సంబంధించి ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తున్నా బ్యాంకర్లు సహకరించడం లేదని, సాధారణంగా బ్యాంకర్లు మంజూరులు ఇచ్చినప్పటికీ సబ్సిడీ మొత్తం విడుదలలో జాప్యం జరుగుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంపై బ్యాంకర్లు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. రుణాల విషయంలో ప్రైవేట్ బ్యాంకులు లక్ష్యాలు సాధిస్తున్నప్పటికీ, జాతీయ బ్యాంకులు వెనుకంజలో ఉంటున్నాయని అన్నారు. జాతీయ బ్యాంకుల బ్రాంచ్‌ల సంఖ్య తగ్గడం సరైంది కాదని.. జాతీయ, గ్రామీణ బ్యాంకులు విస్తృతంగా బ్రాండ్ ఇమేజ్‌ని ప్రచారం చేసుకోవాలని చెప్పారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలన్నారు. తెలంగాణ యువ రాష్ట్రమని.. బాగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. దేశవాసులకే కాదు.. యావత్ ప్రపంచానికి తెలంగాణ పెట్టుబడుల స్వర్గధామం అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు, చౌకగా మానవ వనరులు, మంచి వాతావరణం, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నాయని, భాషా సమస్య లేదని తెలిపారు. బ్యాంకర్లకు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదని ఆయన పేర్కొన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని సూచించారు. సామాజిక ఎజెండానే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని ఆయన అన్నారు.
ఆర్ఆర్ఆర్తో మరింత అభివృద్ధి
తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో పాటు, కోర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇతర క్లస్టర్లు అభివృద్ధి చెందాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో రాష్ట్ర రూపు రేఖలు మారిపోనున్నాయని అన్నారు. అతిపెద్ద రీజినల్ రింగ్ రోడ్డు తో తెలంగాణలో అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఇలా మూడు ప్రాంతాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. లండన్ లో థేమ్స్ నదిని అభివృద్ధి చేసినట్టుగా హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధికి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు, మూసీ పరివాహక ప్రాంతంలో వ్యాపారాలు విస్తరించనున్నాయని తెలిపారు. ఓవైపు వ్యవసాయ రంగం, మరోవైపు పారిశ్రామిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలతో రాష్ట్రం పోటీ పడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని, రైతు భరోసా ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం సమకూరుస్తున్నామని వివరించారు. వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు కొన్ని పంటలకు బోనస్ కూడా అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగిందని.. తద్వారా రాష్ట్రంలో ఇథనాల్ పెట్రోలియం ఉత్పత్తులకు కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్రోత్సాహకాలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామన్నారు. రూపాయి కూడా పెండింగ్‌లో పెట్టలేదని చెప్పారు. ఇటీవల ఆయిల్ ఫామ్ రైతులకు రూ.100 కోట్లు విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ సూక్ష్మ, పెద్ద తరహా పరిశ్రమలకు బ్యాంకర్లు పెద్ద మొత్తంలో రుణాలు అందించి ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగమేనని వివరించారు. బలహీన వర్గాలకు రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమాగ్రాభివృద్ధి సాధిస్తుందన్నారు.
ఆయిల్‌పామ్ సాగుకు బ్యాంకుల ప్రోత్సాహం కరువు: తుమ్మల
రాష్ట్రంలో వివిధ బ్యాంకులు 6,415 శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 1,874 మాత్రమే ఉన్నాయని.. వాటిని పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సూచించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజనలాంటి పథకాల కింద కేవలం ఎన్రోల్మెంట్స్టేటస్ చూపెడ్తున్నారని, ఎంతమందికి లబ్ధి చేకూరిందో వంటివి రిపోర్టులో పెట్టడం లేదని అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి, గత సంవత్సరం కంటే రూ.13 వేల కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికీ.. చిన్న, సన్నకారు రైతుల వాటా అనుకున్నంత లేదని తెలిపారు. రాష్ట్రంలో 73.11 శాతం భూములు చిన్న, సన్నకారు రైతుల వద్దనే ఉన్నాయన్నారు. బ్యాంకు కంట్రోలర్స్ పంటరుణ గ్రహీతల వివరాలు సమగ్రంగా ఉండేటట్లు చూసుకోవాల్సిందిగా అన్ని శాఖల వారికి స్పష్టమైన ఆదేశాలివ్వాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకుల నుంచి ప్రోత్సాహం కరువైందని అన్నారు. రైతుల మేలు కోసం కొత్తగా ఏమైనా స్కీములు రూపొందించడానికి ఆలోచనలు, పరిష్కారాలతో రావాలని బ్యాంకర్లను ఆయన కోరారు.