Telangana Budget2024: తెలంగాణలో టూరిజానికి కొత్త పాలసీ

Telangana Budget2024:  తెలంగాణలో టూరిజానికి కొత్త పాలసీ
  •     పర్యాటక ప్రాంతాలుగా అడవులు
  •     లక్ష మందికి ఉపాధి
  •     టూరిజం రంగాన్ని ఐటీ సెక్టార్​తో అనుసంధానం చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో చాలా వనరులున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే కొత్త టూరిజం పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఈ రంగంలో సుమారు లక్ష మందికి ఉపాధి దొరికేలా చర్యలు తీసుకుంటామని బడ్జెట్ స్పీచ్​లో వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, కొలనుపాక జైన్ మందిరం, నాగార్జునసాగర్, నేలకొండపల్లి బౌద్ధ స్తూపాలు సహా అన్ని ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ‘‘పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడంతో ఆదాయం కూడా వస్తుంది.

దేవాదాయ శాఖ సహకారంతో టెంపుల్ టూరిజం విధానాన్ని తీసుకొస్తాం. వృథాగా ఉన్న పర్యాటక శాఖ ఆస్తులను లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. అటవీ ప్రాంతాలను ఎంపిక చేసుకుని పర్యావరణహితంగా ఉండేలా వాటిని పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతాం. వాటిని, ఐటీ ఇండస్ట్రీతో అనుసంధానం చేస్తాం. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం’’అని భట్టి తెలిపారు. వేములవాడ, భద్రాచలం, బాసర, జమాలాపురం (చిన్న తిరుపతి), ధర్మపురిని మరింత ఆకర్షణీయంగా, భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆలయ భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రిస్తామన్నారు.