
- పూరన్ కుమార్ ఆత్మహత్య బాధించింది
- చండీగఢ్‌లో ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మరణం తనను తీవ్రంగా బాధించిందని, ఈ ఘటన చాలా దురదృష్టకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం చండీగఢ్‌లో అడిషనల్ డీజీ పూరన్ కుమార్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. డిప్యూటీ సీఎం వెంట ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, చండీగఢ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హెచ్ఎస్ లక్కీ, సంవిధాన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ తదితరులు ఉన్నారు.
ఆత్యహత్యకు కారణాలు, కేసు నమోదు తదితర విషయాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పూరన్ కుమార్ భార్య అమ్నీత్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామ భరోసా ఇచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. హర్యానాలో అదనపు డీజీగా పని చేసిన ఆయన, దేశ భద్రతలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రీసెర్చ్ ఎనాలసిస్ వింగ్(ఆర్ఏడబ్ల్యూ)’ విభాగంలో కూడా సేవలందించారని గుర్తు చేశారు.
ఉత్తమ సేవలకు రాష్ట్రపతి మెడల్స్ అందుకున్న ప్రతిభావంతుడైన అధికారి పూరన్ అని తెలిపారు. అలాంటి గొప్ప అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులెవరో సూసైడ్ నోట్ లో చెప్పినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. కులవివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న, పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన శత్రుజీత్ కపూర్ ను డీజీపీగా కొనసాగించడం దారుణమన్నారు. పూరన్ డెడ్‌బాడీకి ఇప్పటికీ పోస్టుమార్టం చేయకపోవడం బాధాకరమన్నారు. వృద్ధురాలైన ఆయన తల్లికి, భార్యకు, కూతుళ్లకు పూరన్ భౌతిక కాయం చూసేందుకు అనుమతించకపోవడం అమానుషమన్నారు.
ప్రధాని, హోం మంత్రికి బాధ్యత లేదా?
ఐపీఎస్ అధికారి కులవివక్షతో ప్రాణం తీసుకున్నారంటే, ఆయన ఎంత వేదన అనుభవించారో అర్థం చేసుకోవచ్చని, ఐపీఎస్ అధికారికే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని భట్టి ప్రశ్నించారు. వారం రోజులుగా హక్కుల సంఘాలు, పౌర సంఘాలు పోరాడుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. హర్యానా, చండీగఢ్ రెండూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ప్రధాని, హోం మంత్రి తమ రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలని డిమాండ్ చేశారు.
ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, మానవ హక్కుల సమస్య అని అన్నారు. డీజీపీ, ఎస్పీని వెంటనే అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించినట్టు చెప్పారు.