పరిపాలనలో ఏఐ వినియోగంపై ఫోకస్ పెట్టండి .. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

పరిపాలనలో ఏఐ వినియోగంపై ఫోకస్ పెట్టండి .. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై ఫోకస్ పెట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. దేశంలోనే పరిపాలనలో ఏఐని పూర్తిస్థాయిలో ఉపయోగించిన  మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో మాట్లాడారు. ఏఐ ఉపయోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకు అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు తగిన శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు అందరికీ సమగ్ర ఏఐ శిక్షణ ఇవ్వాలని సూచించారు. 

అంతేకాకుండా, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) నాయకులకు జిల్లా, మండల స్థాయిలో రెండు రోజుల శిక్షణ ఇచ్చి, వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేలా కృషి చేయాలని స్పష్టం చేశారు.  గత పదేండ్లుగా ఎంసీఆర్హెచ్ఆర్డీపై తగిన దృష్టి సారించలేదని..ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్-కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్‌పర్సన్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ జయ భారతి తదితరులు పాల్గొన్నారు.