- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- మధిరలో విద్యుత్ రంగం ఆధునీకరణకు నాంది
- మధిర నియోజకవర్గంలో రూ. 27.76 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులకు శ్రీకారం
మధిర, వెలుగు : భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా మధిర పట్టణంలోని ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా దిశగా చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎంమల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మధిర నియోజకవర్గంలో మొత్తం రూ.43కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత మధిర పట్టణంలో పర్యటించి రూ.27.76 కోట్లతో చేపట్టిన భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగాడిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం నెరవేరాలంటే విద్యుత్ శాఖ చాలా కీలకమని, ప్రతి రంగ అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అవసరమన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని పాలసీలను రూపొందించుకొని ప్రభుత్వం సీరియస్ గా పని చేస్తోందని తెలిపారు. మధిర పట్టణ ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని లక్ష్యంతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. రూ.27.76 కోట్లు ఖర్చు చేస్తూ 3.5 కిమీ 33 కేవీ లైన్, 17.3 కిలో మీటర్ల 11కేవీ లైన్, 15 కిలోమీటర్ల ఎల్టీ లైన్ భూగర్భంలో వేయనున్నట్లు తెలిపారు.
మధిర సబ్ స్టేషన్ నుంచి ఆత్కూరు రింగ్ రోడ్డు, విజయవాడ రోడ్డు లోని హెచ్ పీ గ్యాస్ గోడౌన్ (రెండు వైపులా), వైఎస్సార్ విగ్రహం నుంచి అంబారుపేట చెరువు వరకు ప్రస్తుత 11 కేవీ ఓవర్ హెడ్ లైన్లను భూగర్భంలో మార్చేందుకు ప్రతిపాదించామని చెప్పారు. నందిగామ బైపాస్ రోడ్డు హెచ్ పీ పెట్రోల్ బంకు నుంచి డంప్ యార్డ్ వరకు భూగర్భ విద్యుత్తు లైన్ పనులు ప్రతిపాదించినట్లు తెలిపారు. విద్యుత్ అంబులెన్స్ లను ట్రాన్స్ ఫార్మర్ తో సహా అవసరమైన సామగ్రి, టెక్నిషియన్స్ తో ఏర్పాటు చేశామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక విద్యుత్ అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.
విద్యుత్ సమస్యలపై 1912 ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఇందిరా గిరి జల వికాసం కింద సోలార్ పంప్ సెట్ల ద్వారా సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ పెంపు లక్ష్యంగా ప్రత్యేక పాలసీ తీసుకొని వచ్చామని, మహిళా సంఘాలతో రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మధిర మండలం రాయపట్నం గ్రామంలో 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి, డీఈ బండి శ్రీనివాసరావు, ఆర్ అండ్ బీ ఈఈ తానేశ్వర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
క్వాలిటీ పవర్ అందించడమే లక్ష్యం
ఎర్రుపాలెం : మండల పరిధిలోని రేమిడిచర్ల విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి డిప్యుటీ సీఎం భట్టి రూ 3.14 లక్షలతో శంకుస్థాపన చేశారు. నిరంతరం క్వాలిటీ విద్యుత్ వ్యవసాయం, గృహ అవసరాల కోసం 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ఆయన తెలిపారు. రేమిడిచర్లలోని మురుగునీటి సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఐఎస్ఓ సర్టిఫికెట్ల అందజేత
మధిర : నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కు ప్రతిష్టాత్మకమైన రెండు ఐఎస్ఓ సర్టిఫికెట్లను మంగళవారం ఖమ్మం జిల్లా మధిర కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి అందజేశారు. విద్యుత్ పంపిణీ కార్యకలాపాలు, సబ్‌స్టేషన్ల నిర్వహణ, సబ్‌స్టేషన్ నిర్మాణాల్లో అత్యుత్తమ నాణ్యతను గుర్తిస్తూ ఐఎస్ఓ 9001:2015 క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సర్టిఫికెట్ ప్రదానం చేసినట్లు వారు వివరించారు. ఉద్యోగుల భద్రతపై తీసుకుంటున్న చర్యలకు గాను, విద్యుత్ అధికారుల పల్లె బాట, పట్టణ బాట లాంటి కార్యక్రమాలు , భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ సంస్థ అనుసరిస్తున్న సురక్షా ప్రమాణాలను గుర్తించి ఐఎస్ఓ 45001:2018 ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సర్టిఫికెట్ కూడా ప్రదానం చేసిందని తెలిపారు.
