జిల్లా ఆస్పత్రి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపండి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

జిల్లా ఆస్పత్రి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపండి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలి
  • ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్ కల్పించాలి
  • అప్ గ్రేడ్ చేసిన ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు చర్యలు 
  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 
  • ఖమ్మం కలెక్టరేట్​లో వైద్య శాఖపై సమీక్ష

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సమర్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్​ హాల్​లో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్ నాయక్ తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

 ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య శాఖ పని తీరును కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రికి అవసరమైన ప్రతిపాదనలు, వైద్య కళాశాలలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చేయాల్సిన ఏర్పాట్ల ప్రతిపాదనలను సమర్పించాలని కలెక్టర్ ను ఆదేశించారు. 

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు 

మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో జనాభా ఆధారంగా అవసరమైన నూతన పీహెచ్​సీ, సబ్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, ఆస్పత్రి భవనాలు, కూలిపోయే స్థితిలో ఉన్న పీహెచ్​సీ, సబ్ సెంటర్ల ప్రతిపాదనలు అందించాలన్నారు. అప్ గ్రేడ్ చేసిన ఆస్పత్రుల్లో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో రెండు అంబులెన్స్ ఉండేలా చూడాలన్నారు. సబ్ సెంటర్ నుంచి పీహెచ్​సీకి ఎంత సమయంలో చేరుకుంటున్నామో పరిశీలించి నివేదిక అందిస్తే, దాని ప్రకారం అంబులెన్స్ లను మంజూరు చేస్తామని చెప్పారు. 

ఖమ్మం వైద్య కళాశాలలో ఉన్న 100 సీట్లను 150 వరకు పెంచేందుకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని 600 పడకలకు అప్​గ్రేడ్​ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  జనరల్ ఆస్పత్రి వద్ద అందుబాటులో ఉన్న స్థలం, ఆస్పత్రి ఓపీ, ఐపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్ కల్పించాలన్నారు. ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్, రిసెప్షన్, ఆర్వో ప్లాంట్ ఉండేలా చూడాలన్నారు.  ఉమ్మడి జిల్లాల ఆస్పత్రులకు తప్పనిసరిగా ఎంఆర్ఐ ఉండాలని చెప్పారు. ఖమ్మం ఆర్గన్ రిట్రివల్ సెంటర్ లో ఏర్పాటు చేస్తామన్నారు. డయాలసిస్ సౌకర్యాన్ని మరింత విస్తరించాలని ఆదేశించారు. వైద్య కళాశాలలో బాయ్స్ హాస్టల్, అంతర్గత రోడ్డు, కాంపౌండ్ వాల్, స్టాఫ్ క్వార్టర్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. 

సమస్యలపై విద్యార్థులతో చర్చ.. 

వైద్య కళాశాల విద్యార్థులతో మాట్లాడిన మంత్రి దామోదర వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గర్ల్స్ హాస్టల్ కు అవసరమైతే అదనపు భవనం తీసుకోవాలన్నారు. టీచింగ్ స్టాఫ్ పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాకు వచ్చే వైద్య పరికరాల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసిన సమీక్ష అనుగుణంగా నివేదికలు పంపాలన్నారు.  వైద్య శాఖ మరింత సమర్థవంతంగా పని చేయాలని, పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. 

ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి తనిఖీ 

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ సీఎం భట్టి డాక్టర్లకు సూచించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర రావు, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తో కలిసి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. మందుల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.  పేషెంట్లతో మాట్లాడుతున్న ఆస్పత్రిలో అందుతున్న సేవలను ఆరా తీశారు. ఆస్పత్రిలో అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. కాగా, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమ వేతనాలు రెగ్యులర్ గా అందేలా చర్యలు చేపట్టాలని, సేవలను క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ మంత్రి దామోదరకు వినతిపత్రం అందజేశారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అడిషనల్​ కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, వైద్య శాఖ సంచాలకుడు డాక్టర్​ నరేంద్ర కుమార్, టీజీ ఎంఐడీసీ  ఎండీ ఫణీందర్ రెడ్డి, ఈఈ ఉమామహేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారులు నర్సింహారావు, రాజేందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ​బి. కళావతి బాయి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్​ రాజేశ్వరరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ కిరణ్ కుమార్, డీసీహెచ్ఎస్  డాక్టర్​రా జశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపాదనలు సమర్పించాం.. 

కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద అదనపు ఫ్లోర్ నిర్మాణానికి రూ.12 కోట్లు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి రూ.కోటితో ప్రతిపాదనలు సమర్పించామన్నారు. వైద్య కళాశాల వద్ద బాయ్స్ హాస్టల్, కాంపౌండ్ వాల్,  అంతర్గత రోడ్లు, రెండు బస్సులు, రెండు 108 సర్వీసులు, నాలుగు పీహెచ్​సీల వద్ద 102 సర్వీస్ ల అవసరం ఉందని తెలిపారు.12 సబ్ సెంటర్ భవనాల పున:నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. జిల్లాలో అత్యవసరంగా ఎంపీహెచ్​ఏ(ఎం)లు, రేడియాలజిస్ట్ , ఫార్మాసిస్టు, గైనకాలజిస్ట్ అవసరం ఉందని చెప్పారు. జిల్లాలో గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ ద్వారా చేసే వైద్య చికిత్సలు మూడు రెట్లు పెరిగాయన్నారు. 

పాలేరు, సత్తుపల్లికి మంజూరు చేసిన నర్సింగ్ కళాశాలలో స్టాఫ్ కోసం సవరించిన జీఓ విడుదల చేయాలని కోరారు. పాలేరు నర్సింగ్ కళాశాల భవనం 85 శాతం పూర్తయిందని, విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. బ్రెస్ట్ మిల్క్ సెంటర్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.