తెలంగాణలో నాణ్యమైన విద్య కోసమే యంగ్ ఇండియా స్కూళ్లు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణలో నాణ్యమైన విద్య కోసమే యంగ్ ఇండియా స్కూళ్లు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : తెలంగాణ స్టూడెంట్లకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఎడ్యుకేషన్‌ విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. 

నిర్మాణంలో ఎక్కడా రాజీ పడొద్దని ఆఫీసర్లకు సూచించారు. యంగ్‌ ఇండియా స్కూల్‌ కోసం సూచించిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు జరగాలని, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, అవసరమైతే కూలీల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. అనంతరం యంగ్‌ ఇండియా స్కూల్‌ను అనుసంధానిస్తూ నిర్మించే రోడ్లపై ఆఫీసర్లతో చర్చించారు. ఆయన వెంట కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, మధిర అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బండారు నరసింహారావు ఉన్నారు.

‘ఇందిరా మహిళా డెయిరీ’ అమలుతో నా కల నెరవేరింది 

ఇందిరా మహిళా డెయిరీతో పాల ఉత్పత్తుల ద్వారా మధిర నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు భారతదేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ‘ఇందిరా మహిళా డెయిరీ’ అమలుతో తన కల నెరవేరిందని తెలిపారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా  డెయిరీ లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  

ఇందిరా మహిళా డెయిరీ తన చిరకాల వాంఛ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 సంవత్సరంలో మధిర నియోజకవర్గంలోని 52,000 మహిళా సంఘాల సభ్యులకు రెండు గేదెలు కొనివ్వాలని ఆరోజు భావించానని, అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పదేండ్లపాటు ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో అమలు చేయలేకపోయానని, తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే పథకాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 

గేదెలు ఉండేందుకు  కొట్టాలు, సోలార్ మంజూరు చేస్తామన్నారు. గేదెలకు దానా, గడ్డి సరఫరా చేసేందుకు కోసం నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించి, వారే వచ్చి సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఉపాధి కల్పిస్తున్న యువతకు ట్రాలీ ఆటోలు కూడా ఇప్పిస్తామన్నారు. ప్రతీ 10 గ్రామాలను యూనిట్ గా  ఏర్పాటు చేసి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. ప్రతినెలా గేదెల ఆరోగ్యాన్ని పరీక్షించేందకు డాక్టర్లు, అంబులెన్స్ వచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు. 

బోనకల్లు మండలంలోని ఇందిరా మహిళా శక్తి పాల పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడి పాల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అమ్మేలా ఏర్పాటు చేస్తామన్నారు. పాల ఉత్పత్తులను పెంచడం ద్వారా మధిర నియోజకవర్గ మహిళలు వెయ్యి కోట్లు సంపాదించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఏడాది 20 వేల మంది మహిళలకు గేదెలను పంపిణీ చేస్తామన్నారు. 

కాంగ్రెస్​లో చేరికలు

వైరా :  రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  ఆదివారం రాత్రి వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, వైరాకు చెందిన ప్రముఖ డాక్టర్ కాపా మురళీకృష్ణ, శ్యాంబాబులతో పాటు మరో 500 మంది నాయకులు, కార్యకర్తలు భట్టి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.