ఈ అసెంబ్లీ సెషన్లోనూ డిప్యూటీ స్పీకర్ నియామకం లేనట్టే!..

ఈ అసెంబ్లీ సెషన్లోనూ డిప్యూటీ స్పీకర్ నియామకం లేనట్టే!..
  •     డిప్యూటీ స్పీకర్ పదవికి విప్ రామచంద్రు నాయక్ పేరు ఇప్పటికే ఖరారు
  •     చీఫ్ విప్​గా పరిశీలనలో మల్‌‌‌‌రెడ్డి రంగారెడ్డి పేరు 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కూడా డిప్యూటీ స్పీకర్ నియామకం జరిగేలా లేదు. ఇప్పటికే ఈ పదవికి విప్ రామచంద్రు నాయక్ పేరు ఖరారు కావడంతో ఈ సెషన్​లో డిప్యూటీ స్పీకర్ నియామకం ఉంటుందని అంతా భావించారు. కానీ, వచ్చే బడ్జెట్ సెషన్​లోనే ఈ నియామకం ఉంటుందనే సంకేతాలు వెలువడడంతో అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన మరికొన్ని పోస్టులు కూడా పెండింగ్ లో పడిపోయాయి. 

చీఫ్ విప్ పదవి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌‌‌‌రెడ్డి రంగారెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నా  క్లారిటీ లేదు. ఇక విప్ గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ పదవి ఖాళీ అయింది. రామచంద్రు నాయక్ కూడా ప్రస్తుతం విప్ గా ఉన్నారు. ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైతే ఆ పదవి కూడా ఖాళీ కానుంది. ఈ లెక్కన ఈ రెండు విప్ పదవుల కోసం మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన పలువురు ప్రయత్నిస్తున్నారు. 

అడ్లూరి లక్ష్మణ్ స్థానంలో  కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరికి విప్​పదవి దక్కనుందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ఇక రామచంద్రు నాయక్ స్థానంలో బాలు నాయక్, మురళీ నాయక్ లలో ఒకరికి ఇవ్వనున్నారని చర్చ నడుస్తోంది. బాలు నాయక్ మాత్రం తనకు మంత్రి పదవి తప్ప మరే పదవి వద్దని తన అభిప్రాయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి,  పీసీసీ నాయకత్వానికి చెప్పినట్లు సమాచారం. 

ఖాళీగానే అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ పదవి

అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్​గా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని నియమించగా.. ఆ పదవిని ఆమె చేపట్ట లేదు. దీంతో 6 నెలలుగా ఆ పదవి ఖాళీగానే ఉంది. ఈ పదవిలో సీనియర్ ఎమ్మెల్యేను నియమించడంపై సీఎం దృష్టి పెట్టారు. కాగా, తనకు మంత్రి పదవి.. లేదంటే ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలని ఉత్తమ్ పద్మావతి పార్టీ నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఉత్తమ్ మంత్రిగా ఉన్నందున ఆమె పేరును ఆర్టీసీ చైర్మన్ పదవికి పరిశీలిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.  ఈ పదవుల భర్తీ వచ్చే బడ్జెట్ సమావేశాల వరకు ఉండొచ్చని అంటున్నారు.