
- ఉన్నత విద్యామండలి ముట్టడికి ఏబీవీపీ లా స్టూడెంట్స్ ఫోరం యత్నం
- అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించిన పోలీసులు
మెహిదీపట్నం, వెలుగు: స్టూడెంట్ల జీవితాలతో వ్యాపారం చేస్తున్న లా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర లా స్టూడెంట్స్ ఫోరం డిమాండ్ చేసింది. మంగళవారం మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి ఆఫీసు వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ.. ఉన్నత విద్యామండలి రూల్స్ పాటించకుండా లా కాలేజీలు మేనేజ్మెంట్ కోటాలో ఫీజులను ఇష్టారీతిన పెంచారని మండిపడ్డారు. బహిరంగంగా సీట్లు అమ్ముకుంటున్న కాలేజీల మేనేజ్మెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు భర్తీ చేసిన మేనేజ్మెంట్ సీట్లను రద్దుచేసి యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెరిట్ ప్రకారంగా భర్తీ చేయాలన్నారు. ఉన్నత విద్యా మండలి ఆఫీసు ముట్టడికి యత్నించిన స్టూడెంట్లను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఆందోళనలో ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ శ్రీకాంత్, లా స్టూడెంట్స్ ఫోరం కన్వీనర్ హరి ప్రసాద్, స్టేట్ జాయింట్ సెక్రటరీ పృథ్వీతేజ, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రాజు, లా స్టూడెంట్స్ ఫోరం కో కన్వీనర్ సాయి ధనరాజ్ పాల్గొన్నారు.