గ్రూప్ 4 ఎగ్జామ్​కు.. నో బయోమెట్రిక్

గ్రూప్ 4 ఎగ్జామ్​కు.. నో బయోమెట్రిక్
  • హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు 
  • వచ్చే నెల 1న ఎగ్జామ్.. హాజరుకానున్న 9.51 లక్షల మంది 
  •  గ్రూప్ 1 ఎగ్జామ్​లో ఇవన్నీ ఎందుకు అమలు చేయలేదని ఇటీవల ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పోటీ పరీక్షలకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఎందుకు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించినప్పటికీ, టీఎస్ పీఎస్సీ మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. వచ్చే నెల 1న జరగనున్న గ్రూప్ 4 ఎగ్జామ్ ను బయోమెట్రిక్ అటెండెన్స్ లేకుండానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లను సిద్ధం చేసింది. ఇటీవల గ్రూప్ 1 ఎగ్జామ్ లోనూ ఇలాగే చేయగా.. అవన్నీ ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణను ఖర్చుల కోణంలో చూడొద్దని, ఖర్చు ఎక్కువవుతుందనే భావనతో పరీక్షల నిర్వహణలో కాంప్రమైజ్ కావొద్దని సూచించింది. అయినప్పటికీ టీఎస్ పీఎస్సీ మాత్రం తన తీరు మార్చుకోలేదు. కాగా, పరీక్షల నిర్వహణకు టీఎస్ పీఎస్సీ కొన్నేండ్లుగా ఇదే విధానం అమలు చేస్తున్నది. ఓఎంఆర్ షీట్లపై హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకపోతే.. వాటిని మార్చవచ్చని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకుంటలేదు. 

ఎక్కువ మంది ఉన్నరనే అమలు చేయట్లేదట!    

రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 33 జిల్లాల్లో 2,846 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే హాల్ టికెట్ల డౌన్​లోడ్ ప్రక్రియ నడుస్తోంది. అయితే, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయకపోవడంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నచిన్న పరీక్షలకు ఈ విధానం అమలు చేస్తుండగా, గ్రూప్స్ పరీక్షలకు అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాగా, 9.51 లక్షల మందికి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం సాధ్యం కాదని టీఎస్​పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. వేలాది సెంటర్లు ఉండగా, వాటిల్లో ఎక్కువ మంది అభ్యర్థులున్నారనీ.. వాళ్లందరికీ బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ తీసుకుంటే చాలా ఆలస్యమయ్యే అవకాశముందని పేర్కొంటున్నారు. ఒకవేళ బయోమెట్రిక్ పరికరం పనిచేయకపోతే సెంటర్ లోని అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అందుకే దీన్ని అమలు చేయడం లేదని అంటున్నారు. 

ఒకే అభ్యర్థికి  రెండు హాల్ టికెట్లు!

గ్రూప్ 4  పరీక్షకు సంబంధించి ఓ అభ్యర్థికి రెండు హాల్ టికెట్లు కేటాయించారని ప్రచారం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థికి రెండు హాల్ టికెట్లు వచ్చాయని.. ఒకదాంట్లో భద్రాద్రిలో సెంటర్ పడగా, మరొకదాంట్లో హైదరాబాద్ లో సెంటర్ పడినట్టుగా టీఎస్ పీఎస్సీ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో సీజీజీ అధికారులు వెరిఫై చేసి, భద్రాద్రిలో సెంటర్ ఉన్నది ఒరిజినల్ హాల్ టికెట్ అని తేల్చారు. హైదరాబాద్ సెంటర్​ఉన్నది ఫేక్ అని చెప్పారు. దీనిపై విచారణ చేపట్టినట్టు టీఎస్ పీఎస్సీ తెలిపింది.