కరోనా ఉన్నా  ఎన్నికలు ఆపేది లేదు

కరోనా ఉన్నా  ఎన్నికలు ఆపేది లేదు
  • ఈ నెల 30న మున్సిపోల్స్​కు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు
  • ఎస్​ఈసీకి లెటర్​ రాసిన సీఎస్!​ 
  • ఏర్పాట్లలో నిమగ్నమైన ఎన్నికల సంఘం
  • వాయిదా వేయాలంటున్న ప్రతిపక్షాలు
  • ప్రచారానికి కేటీఆర్ దూరం
  • టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు బంద్

హైదరాబాద్,వెలుగు: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పోలింగ్​కు   ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా జాగ్రత్తలతో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్​ఈసీకి  లెటర్​ రాసినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగనుంది. అయితే.. రాష్ట్రంలో వేలల్లో కరోనా కేసులు వస్తుండడం, వందల్లో జనం చనిపోతుండడంతో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సంప్రదించగా.. ఎన్నికలను ఆపాల్సిన అవసరం లేదని, షెడ్యూల్​ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు  సమాచారం. దీంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ఏర్పాట్లకు రెడీ అవుతోంది. 

అయితే ఎన్నికల సంఘంలో పనిచేసే సగం మంది సిబ్బందికి కరోనా సోకింది. కొందరు ఐసోలేషన్​లో ఉన్నారు.  దీంతో  ఉన్న సిబ్బందితో రాత్రింబవళ్లు పనిచేసి ఎన్నికల ప్రక్రియ ముగిస్తామని ఎన్నికల సంఘం వర్గాలు అంటున్నాయి. 

వాయిదా వేసే ప్రసక్తిలేదు

కరోనా కేసులు పెరుగుతున్నందున  మున్సిపల్​ ఎన్నికలు వాయిదా వేయాలని మూడు రోజుల కింద కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్  పిటిషన్​ దాఖలు చేసింది. విచారించిన కోర్టు ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత తాము జోక్యం చేసుకోలేమని, అయితే పిటిషనర్ అభ్యంతరాన్ని పరిశీలించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్​ను  కోరింది. మున్సిపల్ యాక్టులోని సెక్షన్ 195 ప్రకారం ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలి. దీంతో మంగళవారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్​ రాసింది. ఆ లెటర్​లో  ఎన్నికలను వాయిదా వేయాలన్న రాజకీయ పార్టీల డిమాండ్లు, కోర్టు సూచనలను ప్రభుత్వానికి వివరించింది. అయితే ఎన్నికల ప్రక్రియ సగంలో ఉన్నందున వాయిదా వేయడం సరికాదని, కరోనా కట్టడి కోసం ప్రభుత్వం పకడ్బందీ  ఏర్పాట్లు చేసిందని బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి లెటర్​ రాసినట్లు సమాచారం. 

భయపడుతున్న లీడర్లు

ఎన్నికలు జరిగే వరంగల్, ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు చెందిన లీడర్లు ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు జంకుతున్నారు. ప్రచారం చేయకుండా ఇంటికే పరిమితమైతే ఓట్లు రావని, అట్లని ప్రచారానికి వెళ్తే  వైరస్  అంటుంకుంటుందని టెన్షన్​ పడుతున్నారు. నాగార్జునసాగర్  బై పోల్​ ప్రచారానికి వెళ్లి వచ్చిన చాలా మందికి కరోనా సోకింది. కొందరు వెంటిలేటర్లపై ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. అదే ఎన్నికల ప్రచారం కోసం హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తోపాటు టీఆర్​ఎస్​ అభ్యర్థి నోముల భగత్ పాటు స్టేజీపైన కూర్చున్న లీడర్లు కూడా కరోనా బారిన పడ్డారు.  ‘‘రాష్ట్రంలో వైరస్ విస్తరణకు నాగార్జునసాగర్  హాట్ స్పాట్​గా  మారింది. అక్కడ ప్రచారంలో పాల్గొన్న వారిలో సగం కంటే ఎక్కువ మందికి వైరస్ సోకింది. ఇలాంటి టైంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటే భయమైతున్నది’’ అని టీఆర్​ఎస్​ లీడర్లు అంటున్నారు. నాగార్జునసాగర్​ ఎలక్షన్​తో ఆ నియోజకవర్గంలోని మండలాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిందని,  ఇప్పుడు  మున్సిపల్​ ఎన్నికలతో కరోనా మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

రాలేమంటున్న కేడర్

ఎన్నికల ప్రచారానికి తాము రాలేమని కార్యకర్తలు చేతులెత్తేస్తున్నారు. సాధారణ టైమ్‌లో ప్రచారం అని మేసేజ్ పెట్టగానే వచ్చే కార్యకర్తలు ఇప్పుడు ఫోన్ చేసినా స్పందిండం లేదని లీడర్లు చెప్తున్నారు. వార్డుల్లో ఓటర్లను ప్రభావితం చేసే కార్యకర్తలను ఇంటికి వెళ్లి బతిమిలాడి ప్రచారానికి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితి టీఆర్ఎస్​లో ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. డబ్బులు ఇచ్చినా ప్రచారానికి  ఎవరూ రావడం లేదని వరంగల్ కు చెందని  ఓ లీడర్​ అన్నారు. 

టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు బంద్

ఈ నెల 27న నిర్వహించాల్సిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను కరోనా సెకండ్ వేవ్  వల్ల రద్దు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కరోనా సోకడంతో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఆయన ఈ నెల చివరి వరకు ఐసోలేషన్​లోనే ఉండాల్సి ఉంటుంది. ‘‘కేసీఆర్​ రాకుండా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఎలా నిర్వహిస్తారు?  కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ టైమ్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిపితే విమర్శలు వస్తాయి’’ అని ఓ సీనియర్ లీడర్  అన్నారు.  అందుకని ఈసారి వేడుకలను తెలంగాణ భవన్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ వరకే  పరిమితం చేయొచ్చని అభిప్రాయపడ్డారు.  

ప్రచారానికి కేటీఆర్ దూరం

సాగర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చాలా మంది లీడర్లకు కరోనా రావడంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంత్రి కేటీఆర్ దూరంగా ఉండాలని నిర్ణaయం తీసుకున్నట్టు టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం కేటీఆర్ వరంగల్, ఖమ్మం ఎన్నికల ప్రచారానికి వస్తారని అక్కడి లీడర్లకు కేటీఆర్ ఆఫీస్​ సమాచారం ఇచ్చింది. రోజుకు రెండు మూడు రోడ్‌ షోలలో పాల్గొనే విధంగా ప్లాన్ చేయాలని చెప్పింది. కానీ సాగర్ సభలో పాల్గొన్న తర్వాత సీఎం కేసీఆర్ కు కరోనా సోకడంతో కేటీఆర్ కూడా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. 

తమ ఇండ్లకు రావొద్దంటున్న ఓటర్లు

ఓట్ల కోసం ప్రచారానికి రావొద్దని ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తమ కాలనీల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ‘‘మా ఇంటికి ప్రచారానికి రావొద్దు. మా ప్రాణాలు మాకు ముఖ్యం” అంటూ కొందరు.. ‘‘మీరు వద్దు. మీ ఓటు వద్దు. మా ప్రాణం మాకు ముద్దు’’ అంటూ  ఇంకొందరు వరంగల్ సిటీలో ఇండ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.