త్వరలో పబ్లిక్ డొమైన్​లోకి రానున్న ప్రైవేటు స్కూళ్ల వివరాలు

త్వరలో పబ్లిక్ డొమైన్​లోకి రానున్న ప్రైవేటు స్కూళ్ల వివరాలు

ప్రైవేటు స్కూళ్ల వివరాలు త్వరలో పబ్లిక్ డొమైన్​లోకి రానున్నాయి. జిల్లాలు, మండలాలవారీగా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్​లో వివరాలను పెట్టేందుకు అధికారులు యోచిస్తున్నారు. 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్ల వివరాలు త్వరలోనే పబ్లిక్ డొమైన్​లోకి రానున్నాయి. జిల్లాలు, మండలాలవారీగా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్​లో వివరాలను పెట్టేందుకు అధికారులు యోచిస్తున్నారు. దీంతో ఏ స్కూల్​కు గుర్తింపు ఉంది? ఏ స్కూల్​కు లేదు? అనే వివరాలను పేరెంట్స్ తెలుసుకునేందుకు ఈజీ కానున్నది. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల వరకూ ప్రైవేటు స్కూళ్లుండగా, వాటిలో 30 లక్షల వరకూ స్టూడెంట్లు చదువుతున్నారు. ఆయా స్కూళ్లను బట్టి రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి స్కూల్ వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంది. కానీ చాలా స్కూళ్లు ఫీజులు, స్టాఫ్ వివరాలను బయటకు చెప్పడం లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏటా యూడైస్ పేరుతో వివరాలు సేకరిస్తున్నా, సరిగా చెప్పడం లేదన్న ఆరోపణలున్నాయి. 

డీటైల్స్ అన్నీ ఆన్​లైన్​లో 

హైదరాబాద్​లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో ఇటీవల లైంగిక ఘటన నేపథ్యంలో ఆ స్కూల్​కు ఐదో తరగతి వరకే పర్మిషన్ ఉన్నా ఏడో తరగతి వరకూ క్లాసులు నిర్వహిస్తున్నట్టు విచారణలో బయటపడింది. ఇలాంటి స్కూళ్లు స్టేట్ వైడ్​గా చాలానే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఒక సెక్షన్​కు పర్మిషన్ తీసుకొని, నాలుగైదు సెక్షన్లు కొనసాగించడం, ప్రైమరీ వరకూ పర్మిషన్ తీసుకొని హైస్కూల్స్ కొనసాగించడం వంటివి చేస్తున్నారు. ఈ విషయాలను గుర్తించిన స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు, స్కూళ్ల డీటెయిల్స్ అన్నీ పబ్లిక్ డొమైన్​లో పెడితే బెటర్ అని ఆలోచిస్తున్నారు. డీఏవీ స్కూల్​లో చదివించే పేరెంట్స్ అంతా ఉన్నత విద్యావంతులే అయినా.. ఆ స్కూల్​కు ఐదో తరగతి వరకే పర్మిషన్ ఉందనే విషయం వారికి తెలియదు. ఒకవేళ స్కూళ్ల వివరాలను వెబ్ సైట్​లో పెట్టి ఉంటే, పేరెంట్స్ కొందరైనా గుర్తించేవారని అధికారులు భావిస్తున్నారు. అందుకే త్వరలోనే స్కూళ్ల వివరాలను వెబ్ సైట్ లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. స్కూల్​కు ఎన్ని క్లాసులకు, ఎన్ని సెక్షన్లకు, ఏఏ మీడియంకు పర్మిషన్ ఉంది? ఏ క్లాసులకు ఎంత ఫీజు, టీచింగ్ స్టాఫ్ ఎంతమంది? వంటి వివరాలన్నీ పెట్టాలని యోచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వారికీ ఈ వివరాలు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు.