నిరుద్యోగుల తిప్పలు..సతాయిస్తున్న టీఎస్​పీఎస్సీ

నిరుద్యోగుల తిప్పలు..సతాయిస్తున్న టీఎస్​పీఎస్సీ
  • ఓటీఆర్​లో విద్యార్హత వివరాలు అప్​డేట్​ కాక నిరుద్యోగులకు తిప్పలు
  • కొత్తగా రిజిస్టర్​  చేసుకునెటోళ్లదీ ఇదే పరిస్థితి
  • క్షణాల్లో రావాల్సిన ఓటీపీ గంటలు గడిచినా వస్తలేదు
  • గతంలో నింపిన కాలమ్స్​ ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నయ్​
  • స్థానికత మార్చుకునేందుకు ఆప్షనే లేదు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ కొలువుల భర్తీలో కీలకంగా వ్యవహరించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) వెబ్​సైట్ నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్నది. ఓటీఆర్​లో తమ విద్యార్హతల అప్​డేషన్ కోసం, కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో సైట్ హ్యాంగ్ అవుతున్నది. పోర్టల్​ నుంచి సెకన్లలో రావాల్సిన ఓటీపీ.. రెండు, మూడు గంటలు గడిచినా రావడం లేదు. దీంతో నిరుద్యోగులు తిప్పలుపడుతున్నారు. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చున్నా వివరాలు అప్​డేట్​ కావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చున్నా వివరాలు అప్​డేట్​ కావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్​ కెపాసిటీని పెంచకపోవడంతోపాటు కమిషన్​ ఆఫీసులో పని చేసేందుకు స్టాఫ్ సరిపోను లేకపోవడంతో సమస్య ఎదురవుతున్నది. వేలాది పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియ చూసే టీఎస్​పీఎస్సీలో 79 మంది పర్మినెంట్ స్టాఫ్  పనిచేస్తున్నారు.   
గతంలో నింపిన కాలమ్స్ 

అన్నీ ఇప్పుడు ఖాళీగానే..!

ఇది వరకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే నిరుద్యోగులు తమ విద్యార్హతల వివరాలను టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​లో ఎంట్రీ చేసుకున్నారు. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్తే గతంలో ఇచ్చిన వివరాలన్నీ ఖాళీగా చూపిస్తున్నాయి. గతంలో అప్​లోడ్ చేసిన సర్టిఫికెట్లను మళ్లీ అప్ లోడ్ చేయాలని చూపిస్తున్నది. ‘స్టడీ సర్టిఫికెట్స్ అప్ లోడ్’ అనే ఓ కాలమ్ కనిపిస్తున్నది. 1వ తరగతి, 2వ తరగతి, మూడో తరగతి సర్టిఫికెట్​.. ఇట్లా పదో తరగతి వరకు స్టడీ  సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలని చూపిస్తున్నది. అయితే, చాలా మంది దగ్గర 4 లేదా 5వ క్లాసు నుంచే స్టడీ సర్టిఫికెట్లు ఉంటున్నాయి. కానీ, ఒకటి, రెండు, మూడు క్లాసుల సర్టిఫికెట్లు కూడా అడుగుతుండడంతో.. వాటిని  ఎక్కడ్నుంచి తేవాలని చాలా మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొత్త కోర్సు యాడ్ చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

స్థానికత మార్చుకునుడు ఎట్లా..?

కొత్త జోనల్ సిస్టం, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం చాలా మంది నిరుద్యోగులకు సంబంధించి జోనల్, మల్టీ జోనల్ పరిధిలో మార్పులు వచ్చాయి. ఇందుకు తగ్గట్టు తమ స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​లో మార్పులు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి ఎలాంటి ఆప్షన్​ లేదు. అభ్యర్థులు 1 నుంచి 7 తరగతులను ఏ జిల్లాలో చదివారో ఎంట్రీ చేస్తే వారు ఏ జిల్లా, ఏ జోన్‌‌‌‌, ఏ మల్టీ జోన్‌‌‌‌కు చెందినవారో వచ్చేలా ఆప్షన్  రావాల్సి  ఉంది. 

కమిషన్​లో సగం పోస్టులు ఖాళీగానే.. 

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పోస్టులను భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​లోనే భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న తక్కువ సిబ్బందిపై ఎక్కువ పని భారం పడుతున్నది. రాష్ట్ర విభజన టైమ్​లో ఏపీపీఎస్సీ నుంచి 128 మంది తెలంగాణ కేడర్ టీఎస్​పీఎస్సీకి అలాట్ అయ్యారు. వీరిలో 40 మంది వరకూ అటెండర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు తదితర నాలుగో తరగతి ఉద్యోగులే ఉన్నారు. అప్పట్లో పెద్ద పోస్టులకు ఆఫీసర్లు తెలంగాణకు అలాట్ కాలేదు. అడిషనల్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, సెక్షన్ ఆఫీసర్  పోస్టులు ఖాళీగానే ఉంటే, పాత పోస్టులను అప్​గ్రేడ్​ చేయించుకున్నారు. అనేక వినతుల తర్వాత టీఎస్​పీఎస్సీలో 165 పోస్టులకు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. రెగ్యులర్ ఎంప్లాయీస్​లో చాలామంది ఏటా కొందరు రిటైర్డ్ కావడంతో ప్రస్తుతం కమిషన్​లో 79 మంది మిగిలారు. సుమారు 24 హెచ్​వోడీ పోస్టులు, 70 వరకు జూనియర్ అస్టిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులతోపాటు ఫోర్త్ క్లాస్  ఎంప్లాయీస్​ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ఏపీ నుంచి 13 మంది అటెండర్లు టీఎస్​పీఎస్సీకి వచ్చారు. కానీ ఆఫీసర్ల పోస్టులు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. సిబ్బంది తక్కువగా ఉన్నారని, ఈ ఉన్న సిబ్బందితో పనిచేయించడం కష్టంగా మారిందని కమిషన్​ నిరుడు వార్షిక నివేదికలో పేర్కొంది. టీఎస్​పీఎస్సీలో 340 మంది ఎంప్లాయీస్ అవసరమని అప్పట్లో వీరభద్రయ్య కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ ఆ పోస్టులను మంజూరు  చేసేందుకు సర్కారు సముఖంగా లేదు. టీఎస్​పీఎస్సీ కూడా మరో 150 మంది కేడర్ అవసరమని గతంలో పలుమార్లు సర్కారుకు ప్రతిపాదనలు పంపినా.. ప్రభుత్వం  స్పందించలేదు. దీంతో కనీసం 95 పోస్టులకైనా అనుమతి ఇవ్వాలని ఓ సారి, చివరికి 60 పోస్టులైనా నింపాలని మరోసారి టీఎస్​పీఎస్సీ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అయినా సర్కారు నుంచి స్పందన రాలేదు. తాజాగా రాష్ట్రంలో భారీగా కొలువులు భర్తీ చేస్తామని, రిక్రూట్మెంట్  క్యాలెండర్ ప్రకటిస్తామని సర్కారు చెప్పడంతో టీఎస్​పీఎస్సీకి కనీసం 400 మందికి పైగా కేడర్ అవసరమని కమిషన్​ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత రిక్రూట్​మెంట్​లోనైనా  టీఎస్​పీఎస్సీకి పోస్టులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

సహనానికి పరీక్ష

టీఎస్​పీఎస్సీ వెబ్ సైట్​లో ‘వన్‌‌ టైమ్‌‌ రిజిస్ట్రేషన్‌‌’ కింద 2021 వరకు 24,82,888 మంది నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. జాబ్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు చూద్దాంలే అని ఇంకా నమోదు చేసుకోని నిరుద్యోగులతోపాటు గత మూడు, నాలుగేండ్లలో డిగ్రీ, పీజీలు అయిపోయినవారిని కలిపితే మరో నాలుగైదు లక్షల మంది రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగుల్లో చాలా మంది ఆ తర్వాత పీజీలు, పీహెచ్​డీలు, బీఈడీ, డీఈడీలాంటి ఇతర కోర్సులు పూర్తి చేసినప్పటికీ టీఎస్​పీఎస్సీ వెబ్ సైట్ లో వివరాలు అప్ డేట్ చేసుకోలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలతో అకడమిక్ క్వాలిఫికేషన్స్ అప్ డేట్ చేసుకుందామని వెబ్ సైట్ లో ఎడిట్ ఓటీఆర్​లోకి వెళ్లి ఐడీ, డేటాఫ్ బర్త్ ఎంట్రీ చేస్తే ‘ప్లీజ్ వెయిట్ ఫర్ 2 మినిట్స్ టు రిసీవ్ ద ఓటీపీ’ అని చూపిస్తుంది. రెండు నిమిషాల్లో రావాల్సిన ఓటీపీ.. ఒకటీ రెండు గంటలు గడిచినా ఇలాగే కనిపిస్తున్నది. ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసి, కొత్తగా ఐడీ ఎంట్రీ చేసినా మార్పు ఉండడం లేదు. నిరుద్యోగుల సహనానికి ఇదొక పరీక్షగా మారింది. ఏ అర్ధరాత్రో, ఎవరూ పెద్దగా వెబ్ సైట్ ఓపెన్ చేయని సమయంలోనో ఓటీపీ వస్తున్నది. 

గ్రూప్ 1, పోలీస్ ఉద్యోగాలకు ఉగాది కల్లా నోటిఫికేషన్
కసరత్తు చేస్తున్న రిక్రూట్‌‌మెంట్ బోర్డులు

హైదరాబాద్, వెలుగు: పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో.. నోటిఫికేషన్లపై రిక్రూట్‌‌మెంట్ బోర్డులు కసరత్తు మొదలుపెట్టాయి. ఉగాది రోజున, లేదంటే అంతకంటే ముందే నోటిఫికేషన్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. గ్రూప్–1లో 503 పోస్టుల భర్తీకి సంబంధించి శాఖల వారీగా వివరాలు, రోస్టర్, సర్వీస్ రూల్స్, ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు అన్ని డిపార్ట్‌‌మెంట్లతో శనివారం టీఎస్‌‌పీఎస్సీ సమావేశం నిర్వహించింది. మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్‌‌మెంట్ డిపార్ట్‌‌మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్ల పోస్టుల భర్తీకి ఆఫీసర్లు ఇండెంట్ ఇచ్చారు. పోలీసు శాఖలో డీఎస్పీ, కమర్షియల్ టాక్స్, రవాణా శాఖ నుంచి కూడా పోస్టుల భర్తీపై క్లియరెన్స్ వచ్చింది. మిగిలిన శాఖల నుంచి కూడా ఈ నెల 28, 29 తేదీల్లో పూర్తి వివరాలు ఇవ్వనున్నట్లు చెప్పాయని టీఎస్‌‌పీఎస్సీకి చెందిన ఉన్నతాధికారి తెలిపారు. లీగల్ ఒపీనియన్​ తీసుకుని ఆ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌‌మెంట్‌‌లో 2,662 పోస్టుల భర్తీకి సంబంధించిన రిపోర్ట్ కూడా టీఎస్‌‌పీఎస్సీకి అందింది. పోలీస్‌‌ రిక్రూట్‌‌మెంట్ బోర్డు (పీఆర్‌‌‌‌బీ) కూడా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి క్లియరెన్స్ తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అంతా రెడీ చేసుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్‌‌మెంట్​ బోర్డు ద్వారా 10,028 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌‌పై ఇంకా కసరత్తు కొనసాగుతోంది.