
- రంగారెడ్డి కలెక్టర్ శశాంక
ఇబ్రహీంపట్నం, వెలుగు: జిల్లాలో మోడల్ గ్రామాలు అభివృద్ధి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్లో మండల అభివృద్ధి అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్లు, ప్లాస్టిక్, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రే వాటర్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై గ్రామాల్లో శ్రద్ధ తీసుకోవాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు. ప్రతి మండలంలో 3 నుంచి 5 గ్రామాలను అధికారులు ఎంపిక చేసుకొని, ప్రత్యేక శ్రద్ధ, దత్తత వంటి చర్యలతో మోడల్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్డీవో శ్రీలత, డీపీవో సురేశ్ మోహన్, సీపీవో సౌమ్య తదితరులు పాల్గొన్నారు.