పట్టు పరిశ్రమ అభివృద్ధికి రాజకీయ గ్రహణం

పట్టు పరిశ్రమ అభివృద్ధికి రాజకీయ గ్రహణం

సెరీకల్చర్ ​భూమిలో స్ట్రీట్​ వెండింగ్ జోన్​ ఏర్పాటుకు నిర్ణయం 

  •     గోడౌన్, ట్రెయినింగ్​ సెంటర్ నిర్మాణాలను అడ్డుకున్న ఎమ్మెల్యే  
  •     డిపార్ట్​మెంట్​కు సమాచారం లేకుండానే స్వాధీనానికి యత్నం  
  •     ఉపాధి దెబ్బతీయొద్దని వేడుకుంటున్న పట్టు రైతులు

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో పట్టు పరిశ్రమ అభివృద్ధికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. పట్టణంలోని సెరీకల్చర్ బిల్డింగ్ ఆవరణంలో పట్టుగూళ్ల అభివృద్ధి, శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కలెక్టర్ రూ.60 లక్షలు సాంక్షన్ చేశారు. ఇటీవల టెండర్ పిలిచి పనులు కూడా ప్రారంభించారు. అయితే ఇక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండింగ్ జోన్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే బాల్క సుమన్ నిర్ణయించారు. సెరీకల్చర్ డిపార్ట్​మెంట్​కు సమాచారం లేకుండానే ఆ నిర్మాణాలను ఆపివేసి భూమిని మున్సిపాలిటీకి కేటాయించడం 
వివాదాస్పదంగా మారింది.  

రూ.60 లక్షలతో గోడౌన్, ట్రెయినింగ్​ సెంటర్

చెన్నూర్​ కొత్త బస్టాండ్​పక్కన ఐటీడీఏకు చెందిన ఎకరం భూమిని 1985 ప్రాంతంలో నాటి ప్రభుత్వం సెరీకల్చర్ ​డిపార్ట్​మెంట్​కు కేటాయించింది. ఇందులో నిర్మించిన గోడౌన్లు, సిబ్బంది క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. పట్టు పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ పట్టుగూళ్ల స్టోరేజీ బిల్డింగ్ ​నిర్మాణం కోసం అప్పటి కలెక్టర్​ భారతి హోళికేరి ఈ ఏడాది జనవరిలో డీఎంఎఫ్​టీ నుంచి రూ.40 లక్షలు సాంక్షన్​చేశారు. అలాగే పట్టు గూళ్లను రైతులు నేరుగా అమ్మకుండా.. దారం తీసి బట్టలు తయారు చేస్తే అదనపు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో మెషీన్ల కోసం మరో రూ.20 లక్షలు మంజూరు చేశారు.  

మున్సిపల్​ అధికారులు నిలదీయడంతో..

ఈ పట్టు పరిశ్రమ భూములపై రాజకీయ నాయకులు, మున్సిపల్​అధికారుల కన్నుపడ్డది. చెన్నూర్​లో 18.30 గుంటల భూమిని తీసుకొని రోడ్డుకు ఇరువైపులా ఎల్​ఆకారంలో స్ట్రీట్ వెండర్ జోన్ గా ప్రకటించుకొని గత మే నెలలో స్థలాన్ని చదును చేయించారు. ఉన్నతాధికారుల పర్మిషన్​లేకుండా మున్సిపాలిటీకి ఎలా కేటాయిస్తారని సెరీకల్చర్​ అధికారులు నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం గోడౌన్లు, ట్రెయినింగ్​సెంటర్ నిర్మాణం కోసం అదే నెలలో టెండర్లు పిలిచి, జూన్​లో పనులు మొదలు పెట్టారు.

ఆ పనులు నడుస్తుండగా ఎమ్మెల్యే బాల్క సుమన్  పీఏ మనోహర్​సదరు కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణను పిలిపించుకొని ఆ పనులను వెంటనే నిలిపేయాలని హుకుం జారీ చేశారు. ఆ స్థలాన్ని  స్ట్రీట్ వెండింగ్​ జోన్ కోసం తీసుకున్నామని చెప్పి పనులను అడ్డుకున్నారు. దీంతో గోడౌన్, ట్రెయినింగ్​ సెంటర్​ నిర్మాణ పనులు ఆగిపోయాయి. 

భయాందోళనలో పట్టు రైతులు

చెన్నూర్​లో పట్టు పరిశ్రమపై ఆధారపడి వందల మంది గిరిజన రైతులు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ పండించే నాణ్యమైన పట్టుగూళ్లకు ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్​ ఉండడంతో ఇక్కడి పట్టు పరిశ్రమకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో పట్టు రైతులకు ట్రెయినింగ్​ఇచ్చి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలని కలెక్టర్ ​భావించినప్పటికీ.. ఇందుకు విరుద్ధంగా ఎమ్మెల్యే బాల్క సుమన్​నిర్ణయాలు తీసుకోవడంపై పట్టు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఉపాధి కోల్పోతామని ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.