సీఎం ఇలాఖాలో కాగితాలకే పరిమితమైన ఆలయాల అభివృద్ధి

సీఎం ఇలాఖాలో కాగితాలకే పరిమితమైన ఆలయాల అభివృద్ధి

సిద్దిపేట, వెలుగు :  సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని రెండు ప్రముఖ పుణ్య క్షేత్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ఏండ్లు గడుస్తున్నా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే జగదేవ్ పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ లోని శ్రీకొండ పోచమ్మ, వర్గల్ మండలంలోని నాచారం శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయాల అభివృద్ధి మాస్టర్​ ప్లాన్​ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించినా పనుల ప్రారంభంలో మాత్రం జాప్యం కొనసాగుతోంది.

రూ.45 కోట్లు అంచనా..

కొండ పోచమ్మ దేవాలయ అభివృద్ధికి రూ.45 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కొమురవెల్లి దర్శనానంతరం భక్తులు కొండ పోచమ్మ ఆలయానికి  రావడం ఇక్కడి ఆనవాయితీ. ఏటా లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు కొండ పోచమ్మ ఆలయం వద్ద కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభ సమయంలో సీఎం కేసీఆర్ ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి అభివృద్ధి కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. యాగశాల, కాటేజీలు, మండపాల నిర్మాణానికి మరో 25 కోట్లు ఖర్చువతుందని అంచనా వేశారు. తరువాత మంత్రులు హరీశ్​ రావు, తలసాని శ్రీనివాస యాదవ్  ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా పనుల్లో మాత్రం పురోగతి లేదు. ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా భూ సేకరణ జరపాలన్న సీఎం ఆదేశాలు కూడా అమలుకు నోచుకోలేదు. కొద్ది నెలల కింద దేవాదాయ కమిషనర్ తో పాటు స్థపతులు కొండ పోచమ్మ ఆలయ అభివృద్ధిపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వెళ్లినా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 

మరో యాదాద్రిలా నాచారం మాస్టర్ ప్లాన్

నాచారం లక్ష్మీనరసింహస్వామి  దేవాలయాన్ని దాదాపు రూ.100 కోట్లతో డెవలప్​ చేస్తామంటూ ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించినా క్షేత్ర స్థాయి పరిశీలనకే 
అధికారులు పరిమితమయ్యారు. నాచారం అభివృద్ధి కోసం 2018లో ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దేవాలయాన్ని మరో యాదాద్రిలా సీఎం కేసీఆర్​ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దాలని భావించినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. ఆరు నెలల కింద సీఎం సెక్రటరీ కే.భూపాల్ రెడ్డి,  దేవాదాయశాఖ కమిషన ర్ని అనిల్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్​ఖాన్​ నాచారం మాస్టర్ ప్లాన్ అమలుపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి ప్లాన్ లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. నాచారం రైల్వే స్టేషన్ నుంచి  దేవాలయం వరకు  చెక్ డ్యామ్​పై నుంచి  బ్రిడ్జి నిర్మాణాం కోసం పరిశీలన జరిపి పలు సూచనలు చేశారు. కానీ ఆశించిన పనులేవీ కావడం లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

త్వరలోనే ప్రపోజల్స్​ రెడీ

మరో యాదాద్రిగా నాచారం లక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు  సిద్ధం అవుతున్నాయి. విడతల వారీగా నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభిస్తాం.  
-  సుధాకర్ రెడ్డి, ఈవో నాచారం దేవాలయం