
ముంబై: శివసేన నేత (షిండే వర్గం), బుల్దానా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఓ క్యాంటీన్ నిర్వాహకుడిపై దాడి చేసిన ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్ అయ్యారు. క్యాంటిన్ నిర్వాహకుడిపై ఎమ్మెల్యే దాడి చేయడం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రవర్తన ఎవరికీ గౌరవప్రదమైనది కాదని చురకలంటించారు. సంజయ్ గైక్వాడ్ చర్య శాసనసభ్యుల ప్రతిష్టను దెబ్బతీసిందని అహసనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపుతాయని పేర్కొన్నారు సీఎం ఫడ్నవీస్.
ALSO READ | పప్పు వాసన చూపించి మరీ పొట్టుపొట్టు కొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..!
క్యాంటీన్‌లో ఆహార నాణ్యతకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు అధికారికంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. అంతేకానీ ప్రజా ప్రతినిధులు దాడి చేయడం సరికాదని.. ఇది ప్రజలకు సరైన సందేశాన్ని పంపదన్నారు. శివసేన (యుబిటి) ఎమ్మెల్యే అనిల్ పరాబ్ మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తారు. అధికార కూటమి ఎమ్మెల్యే దాడి పాలకవర్గ రాజకీయ దురుసుతనానికి నిదర్శనమని పరాబ్ విమర్శించారు. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎమ్మెల్యే సంజయ్ దాడి ఘటనపై రియాక్ట్ అయ్యారు.
కాగా, ముంబై చర్చ్ గేట్ ప్రాంతంలోని ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్ నిర్వాహకుడిపై బుల్దానా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ దాడి చేశాడు. పప్పు క్వాలిటీ బాలేదని క్యాంటీన్ నిర్వాహకుడి చెంప చెళ్లుమనిపించాడు. పిడి గుద్దులతో ముఖం పగలగొట్టాడు. పైగా.. తాను అలా ప్రవర్తించడంతో తప్పే లేదని ఈ ఘటన జరిగిన తర్వాత తనను తాను సమర్థించుకున్నాడు. ఒకరిపై విచక్షణా రహితంగా దాడి చేసిందే కాకుండా ‘‘శివసేన స్టైల్’’ ఇలానే ఉంటుందని సదరు ఎమ్మెల్యే సమర్థించుకోవడం కొసమెరుపు. క్యాంటీన్ ఆపరేటర్పై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి ఇంత దురుసుగా ప్రవర్తించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.