పప్పు వాసన చూపించి మరీ పొట్టుపొట్టు కొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..!

పప్పు వాసన చూపించి మరీ పొట్టుపొట్టు కొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..!

ముంబై: మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే పప్పు క్వాలిటీ బాలేదని క్యాంటీన్ నిర్వాహకుడి చెంప చెళ్లుమనిపించాడు. పిడి గుద్దులతో ముఖం పగలగొట్టాడు. పైగా.. తాను అలా ప్రవర్తించడంతో తప్పే లేదని ఈ ఘటన జరిగిన తర్వాత తనను తాను సమర్థించుకున్నాడు. ఈ ఘటన ముంబైలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ముంబై చర్చ్ గేట్ ప్రాంతంలోని ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. క్యాంటీన్ ఆపరేటర్పై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి ఇంత దురుసుగా ప్రవర్తించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇండియాలో రాజకీయ నాయకుడైతే ఏదైనా చేయొచ్చనే అహంకారంతోనే ఎమ్మెల్యే ఇలా భౌతిక దాడులకు దిగాడని విమర్శిస్తున్నారు. ఒకరిపై విచక్షణా రహితంగా దాడి చేసిందే కాకుండా ‘‘శివసేన స్టైల్’’ ఇలానే ఉంటుందని సదరు ఎమ్మెల్యే సమర్థించుకోవడం కొసమెరుపు. జరిగిన ఘటనపై ఏమాత్రం పశ్చాతాపం చెందడం లేదని ఎమ్మెల్యే చెప్పడంతో ఈ ఘటనపై నెలకొన్న వివాదం మరింత ముదిరింది. ఈ దాడికి పాల్పడిన మహారాష్ట్రలోని బుల్ధానా నియోజకవర్గ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్కు వెళ్లి సదరు ఎమ్మెల్యే థాలీ ఆర్డర్ చేశాడు. క్యాంటీన్ సిబ్బంది ఎమ్మెల్యేకు థాలీ వడ్డించారు. అయితే ఆ థాలీలోని పప్పు దుర్వాసన వస్తున్నట్లు ఎమ్మెల్యే గుర్తించారు. కోపంతో శివాలెత్తిపోయిన ఎమ్మెల్యే వెంటనే అక్కడున్న వాళ్లను పిలిచి ఆ పప్పు ప్యాకెట్ వాసన చూడమని చెప్పారు. ‘‘ఇది నాకు ఇచ్చింది ఎవరు..? ఒక్కసారి వచ్చి ఈ పప్పు వాసన చూడండి.. ఒక ఎమ్మెల్యేకు మీరు ఇలాంటిది ఇస్తున్నారంటే.. కామన్ పబ్లిక్కు ఏం ఇస్తున్నారు..?’’ అని క్యాంటీన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్యాంటీన్ ఆపరేటర్ను పిలవండని సిబ్బందికి చెప్పగా.. అతనికి సిబ్బంది కాల్ చేశారు. క్యాంటీన్ ఆపరేటర్ రాగానే అతనికి ఆ పప్పు వాసన చూపించిన ఎమ్మెల్యే ఆ క్యాంటీన్ నిర్వాహకుడి చెంప చెళ్లుమనిపించాడు. ఎమ్మెల్యే కొట్టిన దెబ్బలకు క్యాంటీన్ నిర్వాహకుడు దెబ్బకి ఫ్లోర్పై పడ్డాడు. ఆ క్యాంటీన్ ఫుడ్ క్వాలిటీ లేదని ఎమ్మెల్యే నిలదీయడంలో తప్పేం లేదని.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పి క్యాంటీన్ను సీజ్ చేయించాలని.. అంతే కానీ ఇలా భౌతిక దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని ఈ ఘటనపై నెటిజన్లు అభిప్రాయపడ్డారు.