అడవి వీడిన అగ్రనేతలు..లొంగిపోయిన దేవ్‌‌‌‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహా రెడ్డి

అడవి వీడిన అగ్రనేతలు..లొంగిపోయిన దేవ్‌‌‌‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహా రెడ్డి

డీజీపీ సమక్షంలో లొంగిపోయిన దేవ్‌‌‌‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహా రెడ్డి

అజ్ఞాతంలో తెలంగాణకు చెందిన మరో 11 మంది వారు కూడా లొంగిపోతారు: డీజీపీ శివధర్​రెడ్డి
గత రెండేండ్లలో 544 మంది మావోయిస్టులు లొంగిపోయారు
జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కులను కాపాడుతాం 
అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుపెడ్తామన్న పోలీస్ ​బాస్​
మావోయిజానికి అంతం లేదు: దేవ్‌‌‌‌జీ, మల్లా రాజిరెడ్డి
ప్రజల కోసం చట్టబద్ధ పోరు కొనసాగిస్తామని వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  సమసమాజ స్థాపనే ధ్యేయంగా దశాబ్దాల కింద అడవిబాట పట్టి, మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపిన అన్నలు.. ఎట్టకేలకు అడవిని వీడారు. ఆపరేషన్ ​కగార్​ పేరుతో కేంద్ర ప్రభుత్వ తీవ్ర నిర్బంధానికి తోడు, రాష్ట్ర పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో  కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్​ దేవ్​జీ సహా నలుగురు అగ్రనేతలు మంగళవారం డీజీపీ శివధర్​రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. సరెండర్​అయినవారిలో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్‌‌‌‌ సంగ్రామ్‌‌‌‌, మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్‌‌‌‌ దామోదర్‌‌‌‌, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్‌‌‌‌ గంగన్న ఉన్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌‌‌‌లోని కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అడిషనల్‌‌‌‌ డీజీలు మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌, అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌, విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌, ఎస్‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌, ఐజీ సుమతితో కలిసి శివధర్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. మావోయిస్టు పార్టీ మాజీ దళపతి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌‌‌‌ గణపతి మినహా తెలంగాణకు చెందిన అగ్రనేతలంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయారని, ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా త్వరలోనే లొంగిపోతారని డీజీపీ ప్రకటించారు. మార్చి 31 డెడ్‌‌‌‌ లైన్ అంటూ ఏదీ లేదని.. నిరంతరం ప్రక్రియగా మావోయిస్టుల ఏరివేత  కొనసాగుతుందని పేర్కొన్నారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలకంగా వ్యవహరించిన  ఎస్‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌ సుమతి సహా ఎస్‌‌‌‌ఐబీ టీమ్‌‌‌‌ను, ఇంటెలిజెన్స్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ డీజీ విజయ్‌‌‌‌కుమార్​ను డీజీపీ అభినందించారు.

రెండేండ్లలో 544 మంది మావోయిస్టులు లొంగిపోయారు: డీజీపీ

రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ జరగడం లేదని డీజీపీ శివధర్​రెడ్డి తెలిపారు. 2019లోనే చివరి రిక్రూట్‌‌‌‌ మెంట్‌‌‌‌ జరిగిందన్నారు.  లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్రంలో పునరావాస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి పిలుపు మేరకు, తెలంగాణ సరెండర్‌‌‌‌ పాలసీ ద్వారా ఎంతో మంది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోతున్నారని తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్‌‌‌‌ గణపతి అడవుల బయట షెల్టర్‌‌‌‌లో ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో గణపతి, పుసునూరి నరహరి, బిష్రా అలియాస్‌‌‌‌ సాగర్‌‌‌‌ మాత్రమే మిగిలినట్టు తెలిపారు. కాగా, గత రెండేండ్లలో ఇప్పటి వరకు నలుగురు సెంట్రల్‌‌‌‌ కమిటీ సభ్యులు సహా  మొత్తం 544 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు డీజీపీ తెలిపారు.  మొత్తంగా 5,865 మంది మావోయిస్టులు లొంగిపోయాని వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులపై కేసుల విషయంలో సానుభూతితో వ్యవహరిస్తామని తెలిపారు. జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తామని, అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేస్తామని డీజీపీ అన్నారు. కాగా, లొంగిపోయిన మావోయిస్టులు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డికి ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకం కింద డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డి అందించారు. 

మావోయిజం ఎప్పటికీ అంతం కాదు: దేవ్‌‌‌‌జీ, రాజిరెడ్డి

మావోయిజం ఎప్పటికీ అంతంకాదని లొంగిపోయి న మావోయిస్టు నేతలు స్పష్టం చేశారు. తాము అనారోగ్య కారణాలతోనే అజ్ఞాతాన్ని వీడి బయటకి వచ్చామని, రాజకీయాల్లోకి వచ్చి చట్టబద్ధంగా ప్రజా సమస్యలపై పోరాడుతామని ప్రకటించారు. లొంగిపోయిన అనంతరం తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు మరోసారి వివరంగా సమాధానమిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు వెంటనే చేసే కామెంట్స్​ అనవసర చర్చకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా తిప్పిరి తిరుపతి మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతోనే తాను లొంగిపోయాను తప్ప వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించేందుకు మాత్రం కాదన్నారు. ‘‘ప్రజా సమస్యలపైనే చట్టబద్ధ పద్ధతుల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. దీనికి రాజకీయ జీవితాన్ని 
కొనసాగిస్తానని అర్థం. దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్నే గైడెన్స్‌‌‌‌గా తీసుకుని పనిచేస్తాను. రాజకీయ ప్రవేశం చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని భావిస్తున్నాను. 
ప్రస్తుతం మీడియా అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే పరిస్థితిలో లేను.  ఏదీ మాట్లాడినా అపార్థాలకు దారి తీసే ప్రమాదం ఉంది. అది నా రాజకీయ భవిష్యత్తుకు సమస్య కాకూడదని భావిస్తున్నా. మళ్లీ మీతో (మీడియానుద్దేశించి) కలిసి అన్ని వివరాలు వెల్లడిస్తా’’ అని పేర్కొన్నారు. మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ.. మావోయిజానికి అంతంలేదన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా మావోయిజం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సాయుధ పోరాటం ముగిసిందని చెప్పలేం. ప్రజాస్వామ్య పద్ధతిలో, చట్టపరిధిలో పనిచేయాలని ఆలోచిస్తున్నాం. ఇన్నాళ్ల ఉద్యమంలో పొందిన అవగాహనతోనే ముందుకు వెళతాం. పనిచేయాలని అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టమ్‌‌‌‌లోకి వెళ్లాలనేది నా ఉద్దేశం కాదు. అవకాశాల మేరకు ప్రజల పోరాటాల వెనుక నిలబడుతాం. కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వంతో చర్చిస్తాం’’ అని పేర్కొన్నారు. 

పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి దేవ్‌‌‌‌జీ

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్‌‌‌‌ దేవ్‌‌‌‌జీ.. కోరుట్ల ప్రభుత్వ జూనియర్‌‌‌‌ కాలేజీలో చదువుతున్న టైంలో విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై, 1982లో పీపుల్స్‌‌‌‌వార్‌‌‌‌లో చేరారు. 1987 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ వరకు సిరోంచా ప్రాంత సాయుధ దళ కమాండర్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు నిర్వహించారు. 1989 ఏప్రిల్‌‌‌‌ నాటికి డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 1993లో ఉత్తర గడ్చిరోలి సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా, 1995లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2001లో జరిగిన 9వ మహాసభల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎం) సభ్యుడిగా నియమితుల య్యారు. 2017లో  సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎం) ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌గా,  పొలిట్ బ్యూరో సభ్యుడి (పీబీఎం)గా ఎన్నికయ్యారు.  మల్లోజుల వేణుగోపాల్ అలియాస్‌‌‌‌ సోను లొంగిపోయిన అనంతరం 'అభయ్' పేరుతో పార్టీ  అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. దేవ్‌‌‌‌జీ భార్య అరికె జైనీ అలియాస్‌‌‌‌ సృజన కాసన్సూర్ అటవీ ప్రాంతంలో 2020 లో మృతి చెందారు. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా ప్రకటించనప్పటికీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవ్‌‌‌‌జీ గుర్తింపు పొందారు. 

ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌యూ నుంచి ఎదిగిన మల్లా రాజి రెడ్డి

పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులవల్లె గ్రామానికి చెందిన మల్లా రాజిరెడ్డిది  వ్యవసా య కుటుంబం. తండ్రి వెంకట్ రెడ్డి, తల్లి రాజమ్మ, తమ్ముడు ఉన్నాడు. 1971లో రాజిరెడ్డి ఇంటర్​ పూర్తి చేసి, 1974లో ఆర్ఎస్‌‌‌‌యూలో చేరారు. 1976లో  కోరుట్ల, జగిత్యాలలో నమోదైన పలు కేసుల్లో రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 1978 నుంచి 1980 వరకు గోదావరిఖనిలోని బొగ్గు గనులు ప్రాంతంలో ఆర్గనైజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. 1982లో పీపుల్స్‌‌‌‌ వార్‌‌‌‌లో చేరారు.  చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని భూపాల పట్నం ఏరియా డివిజనల్ కమిటీ సభ్యుడుగా పదోన్నతి పొందారు. 1988లో ఆదిలాబాద్ సబ్‌‌‌‌ జైలు నుంచి పారిపోయి అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లోకి వెళ్లారు.1990లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి మార్గనిర్దేశం చేసే బాధ్యతలు నిర్వహించారు.  2022లో  దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌‌‌‌చార్జిగా నియమి తుడై  ప్రస్తుతం అదే హోదాలో ఉన్నారు. 

ఎల్​ఎల్​బీ చదువుతూ అజ్ఞాతంలోకి నూనె నర్సింహారెడ్డి.. 

ఏపీలోని గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరుకు చెందిన నూనె నర్సింహారెడ్డి నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌బీ చదువుతున్న సమయంలో రిటైర్డ్‌‌‌‌ లెక్చరర్‌‌‌‌ జంధ్యాల రవీంద్రనాథ్‌‌‌‌ నాయకత్వంలో 1987లో ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌యూలో చేరారు. 1990లో దుర్గి దళానికి ఇన్‌‌‌‌చార్జిగా నియమితులయ్యారు. 1993లో కమాండర్‌‌‌‌గా 1995లో ఏపీ సౌత్‌‌‌‌ కోస్టల్‌‌‌‌ బెల్ట్‌‌‌‌ కమిటీలో, 1998 నుంచి 2001 వరకు డివిజనల్‌‌‌‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2002లో విజయవాడలో పోలీసులు అరెస్టు చేయగా 2004లో విడుదలయ్యారు. ఆ తర్వాత 2005లో ఏఓబీఎస్‌‌‌‌జెడ్‌‌‌‌సీ బదిలీ అయ్యారు. 2010లో మళ్లీ అరెస్టయి, 2014లో విడుదలయ్యారు. 2020లో డీకేఎస్‌‌‌‌జెడ్‌‌‌‌సీ బెటాలియన్‌‌‌‌ పొలిటికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ అ‍డ్వైజర్‌‌‌‌గా పనిచేశారు.  మే 2025 నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ అయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

సమీప బంధువు ప్రోద్బలంతో ఉద్యమంలోకి దామోదర్‌‌‌‌‌‌‌‌..

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌‌‌‌ 1996లో ములుగు జిల్లా రాయనిగూడెం ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆర్ఎస్‌‌‌‌యూలో చేరారు. 1998 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో తన సమీప బంధువు బడే నాగేశ్వర్ రావు అలియాస్‌‌‌‌ ప్రభాకర్ ప్రోద్భలంతో  పీపుల్స్‌‌‌‌ వార్‌‌‌‌ గ్రూప్‌‌‌‌లో చేరి అఙ్ఞాతంలోకి వెళ్లారు. దామోదర్ ఏటూరునాగారం- మహాదేవ పూర్ ప్రాంత మహిళా దళం, కొత్తగూడెం -పాల్వంచ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2000లో  ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్‌‌‌‌‌‌‌‌గా పదోన్నతి పొందాడు. 2019లో దామోదర్‌‌‌‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్​చార్జిగా నియమితులయ్యారు. 2025 జనవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది అదే హోదాలో పనిచేస్తున్నారు. దామోదర్ జనవరి 2001లో, ఏటూరునాగారం దళంలో పార్టీ సభ్యురాలు ఎట్టి నర్సమ్మ అలియాస్‌‌‌‌ సబితను వివాహం చేసుకున్నారు. 2012లో సుక్మా జిల్లా పువ్వర్తిలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఆమె మృతి చెందగా.. 2016 అక్టోబర్‌‌‌‌లో చర్ల కమిటీలో పనిచేస్తున్న మడకం కోసి అలియాస్‌‌‌‌ రజితను వివాహం చేసుకున్నారు. 2022లో తెలంగాణ పోలీసులు ఈమెను అరెస్టు చేయగా ప్రస్తుతం జైలులో ఉన్నారు.

తెలంగాణ నుంచి మిగిలింది వీళ్లే.. 

కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌‌‌‌ గణపతి, ఈస్ట్‌‌‌‌ డివిజనల్‌‌‌‌బ్యూరో సభ్యుడు, మావోయిస్టు టెక్నికల్‌‌‌‌ విభాగం ఇంచార్జి పుసునూరి నరహరి అలియాస్‌‌‌‌ సంతోష్‌‌‌‌, ఒడిశా స్టేట్‌‌‌‌కమిటీ సభ్యుడు ముప్పిడి సంబయ్య అలియాస్‌‌‌‌ సుదర్శన్‌‌‌‌, దండకారణ్యం స్పెషల్‌‌‌‌ జోనల్‌‌‌‌ కమిటీ, కమ్యూనికేషన్‌‌‌‌ విభాగం ఇన్​చార్జి వార్త శేఖర్‌‌‌‌ అలియాస్‌‌‌‌ మంగ్తు, గణపతి భార్య మాడ్‌‌‌‌ డివిజన్‌‌‌‌ ఇన్​చార్జి  జోడే రత్నాభాయ్‌‌‌‌ అలియాస్‌‌‌‌ సుజాత, దండకారణ్య స్పెషల్‌‌‌‌ జోనల్‌‌‌‌ కమిటీలో ఎడ్యుకేషన్‌‌‌‌ కమిటీ ఇన్​చార్జి లక్కా సుశీల అలియాస్‌‌‌‌ రేల, దేవ్‌‌‌‌జీతోపాటు కంప్యూటర్‌‌‌‌ఆపరేటర్‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ అలియాస్‌‌‌‌ భగత్‌‌‌‌సింగ్‌‌‌‌, మాడ్‌‌‌‌ డిజినల్‌‌‌‌ కమిటీ డీసీఎం రంగబోయిన భాగ్య అలియాస్‌‌‌‌ రూపీ, చర్లలో ఏసీఎం మడివి అడిమె అలియాస్‌‌‌‌ సంగీత, దేవ్‌‌‌‌జీ టీంలో పనిచేసే కాశపోగు భవానీ అలియాస్‌‌‌‌ సుగుణ, ఇల్లెందు నర్సంపేట ఏరియా కమాండర్‌‌‌‌ కుంజం ఇడామల్‌‌‌‌.