పోతురాజుల విన్యాసాల సందర్భంగా కర్రలతో దాడి

పోతురాజుల విన్యాసాల సందర్భంగా కర్రలతో దాడి

ఓ వైపు ఘనంగా బోనాల వేడుకలు జరుగుతుండగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద కొందరు భక్తులు ఆందోళనకు దిగారు. గంజాయి, వైట్నర్, మద్యం మత్తులో అల్లరి మూకలు తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అల్లరి మూకలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.  హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో భక్తులు శాంతించి ఆందోళన విరమించారు.  కాగా,  ఓల్డ్ సిటీలో పోతురాజుల విన్యాసాల సందర్భంగా  గొడవ చోటుచేసుకుంది. ప్రదర్శన సందర్భంగా కొందరు వ్యక్తులు పరస్పరం గొడవపడి, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 

బోనాలకు భారీ ఏర్పాట్లు

బోనాల సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఇవాళ తెల్లవారు జామునుంచే కోలాహలం కనిపిస్తోంది. బోనాలు సమర్పించడానికి భారీ సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చారు. బోనాల సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా లాల్ దర్వాజా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. బోనాల జాతర సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ అదనపు కమిషనర్ చౌహన్ వెల్లడించారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మఫ్టీలో షీ టీమ్స్ సభ్యులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీఐపీల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని.. భక్తులు ప్రశాంతంగా బోనాల జాతరకు రావొచ్చన్నారు. వాతావరణ పరిస్థితి కారణంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కమిషనర్ చౌహాన్ వివరించారు.