కరోనా భయం..గుళ్లకూ పోనిస్తలే

కరోనా భయం..గుళ్లకూ పోనిస్తలే

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు గుళ్లు సందడి సందడిగా ఉండేవి. మహిళల పూజలు , వరలక్ష్మీ వ్రతాలతో కళకలలాడేవి.. కానీ, కరోనా మహమ్మారితో ఇపుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. శ్రావణంలోని తొలి శుక్రవారం, నాగుల పంచమి నాడు భక్తులు పెద్దగా గుడికి వెళ్లలేదు. ఎప్పుడూ వేల సంఖ్యల్లో భక్తులతో ఉండే ఆలయాలు,ఇపుడు కొద్ది మంది భక్తులతో కళ తప్పాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది చాలా మంది జనం ఇంటి వద్దే పూజలు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో గుళ్లకు ఆదాయం తగ్గిపోయి కొన్ని చోట్ల సిబ్బంది వేతనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా లాక్ డౌన్ తో దాదాపు రెండు నెలలు గుళ్లు మూతపడ్డాయి. అన్ లాక్ లో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలకు పర్మిషన్ ఇచ్చినా పరిమిత దర్శనాలకే అనుమతిలిచ్చారు. అయితే కరోనా భయంతో జనాలు గుళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించట్లేదు.

జాగ్రత్తలు తీసుకుంటున్నా..

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని గుళ్లలోనూ కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా డబ్బాలు గీశారు. శానిటైజర్లు, ఏర్పాటు చేశారు. థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్నారు. అయినా భక్తుల రద్దీ కనిపించడం లేదు. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు, ఇతర విశేష కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ, ఇపుడు మామూలు దర్శనాలకు రావట్లేదు. దీంతో క్యూ లైన్లు ఖాళీగా ఉండి..ఆలయ పరిసరాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆలయాల వద్ద ఉండే చిన్నచిన్న దుకాణదారులు గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రలోని ప్రధాన ఆలయాలైన యాదాద్రి, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, ధర్మపురి, చెర్వుగట్టు,కొమురవెల్లి,, బల్కంపేట ఎల్లమ్మ, బాసర, తదితర దేవాలయాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి ఉంది. శ్రావణ మాసంలో ఆలయాల్లో ఇలాంటి పరిస్థితి ఎపుడూ చూడలేదని అర్చకులు చెబుతున్నారు.

ఆన్ లైన్ ఉన్నా..ఆసక్తి లేదు

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం చాలా ఆలయాల్లో ఆన్ లైన్ దర్శనాలను ఏర్పాటు చేసింది. యాదాద్రి,వేములవాడ, భద్రాచలంతో పాటు హైదరాబాద్ లోని కొన్ని ఆలయాల్లో ఈ సదుపాయాన్ని కల్పించింది. దర్శనాలతో పాటు మృత్యుంజయ హోమం, ధన్యంతరి, హోమాలను ఆన్ లైన్ లోనే చేసుకునే వీలు కల్పించారు. ఆన్ లైన్ లోనే హుండీ డబ్బులు సమర్పించుకునే మన హుండీని ఏర్పాటు చేశారు. కానీ దీనిపై భక్తులు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు.

పడిపోయిన ఆదాయం

భక్తులు రాకపోవడంతో ఆదాయం రావట్లేదు. యాదాద్రిలో జూన్ 8 నుంచి జులై 7 వరకు హుండీ ఆదాయం ప్రసాద విక్రయాలు, ఆన్ లైన్ పూజలు కలిపి రూ. 74 లక్షల ఆదాయం వచ్చింది. కరోనా ముందు నెలకు రూ.10 కోట్ల దాకా వచ్చేదని అధికారులు చెబుతున్నారు.