బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో తోపులాట

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో తోపులాట

సికింద్రాబాద్, వెలుగు : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవంలో తోపులాట జరిగింది. మంగళవారం అమ్మవారి కల్యాణోత్సవం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీనికితోడు వీఐపీల తాకిడి కూడా పెరగడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎండ వేడి తాళలేక అవస్థకు గురయ్యారు. ఈ క్రమంలోనే క్యూలైన్లలో నిల్చున్న భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు భక్తులు ఊపిరి ఆడక క్యూలైన్లలోనే స్పృహ తప్పి పడిపోయారు. తోటి భక్తులు వెంటనే వారిని బయటకు తీసుకొచ్చి సపర్యలు చేశారు. ఓ వృద్ధురాలు కరెంట్ షాక్​కు గురికావడంతో ఆమెను హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పిల్లలు, మహిళలు తప్పిపోయారు. వారికోసం కుటుంబ సభ్యులు మైక్​లో అనౌన్స్​మెంట్లు చేయించాల్సి వచ్చింది. క్యూలైన్లు మెయింటెన్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని భక్తులు ఆరోపించారు.

ఒకే లైన్​లో మహిళలు, పురుషులు

అధికారులు విచ్చలవిడిగా వీఐపీ పాస్​లు జారీ చేశారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఫెయిల్ అయ్యారని భక్తులు మండిపడ్డారు. వీఐపీల తాకిడి కారణంగా సామాన్య భక్తులు అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఓపిక నశించడంతో కొందరు బారికేడ్లు దూకేందుకు ప్రయత్నించారు. దీంతో బారికేడ్లు విరిగిపోయాయి. దర్శనానికి వెళ్లే పురుషులు, మహిళలకు సెపరేట్ క్యూలైన్లు ఏర్పాటు చేయలేదని భక్తులు మండిపడ్డారు. అందరినీ ఒకే లైన్​లో పంపించడంతో ఇబ్బందిగా మారిందన్నారు. ఎమర్జెన్సీ సేవలు కూడా అందుబాటులో ఉంచలేదని ఫైర్ అయ్యారు. అంబులెన్స్​లను ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి కల్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని వారం రోజులుగా చెబుతూ వచ్చారని, తీరా చూస్తే ఒక్కటీ సరిగ్గా లేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని భక్తులు విమర్శించారు. 

పట్టువస్త్రాలు సమర్పించిన తలసాని దంపతులు

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం వైభవం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎస్ శాంతికుమారి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు  లక్ష్మి బాల్​రెడ్డి, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అమ్మవారిని దర్శించుకున్నారు. 

కత్తితో దాడి..ఒకరికి గాయాలు

రోడ్లపై ఏర్పాటు చేసిన బ్యాండ్​ మేళాలు, డీజే స్టేజీలు వద్ద యువత పెద్ద ఎత్తున చేరి స్టెప్పులు వేస్తుండగా వీరిలో  మద్యం సేవించిన కొందరి వల్ల ఘర్షణలు మొదలయ్యాయి. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు  కత్తితో కృష్ణ నగర్ కు చెందిన శుభం(24 )అనే వ్యక్తి పై దాడి చేశారు. ఎల్లారెడ్డి గూడకు చెందిన కార్తీక్( 20 )తలకి తీవ్ర గాయం అయింది.  పదిమందికి పైగా కొట్లాటలో  గాయాలయ్యాయి.