
పద్మారావునగర్/దిల్సుఖ్నగర్/ మేడిపల్లి, వెలుగు : శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా సిటీలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. లష్కర్ బోనాల ఉత్సవాల్లో భవిష్యవాణిలో అమ్మవారు కోరినట్లుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి పప్పు, బెల్లంతో చేసిన 21 సాకలను పండితులు సమర్పించారు. భక్తులు తమ ఇండ్ల నుంచి తెచ్చిన సాకలను పోశారు.
ఎల్బీనగర్ ఆర్‌కె పురం అష్టలక్ష్మి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోడుప్పల్‌లోని నిమిషాంబికా దేవి ఆలయంలో 1,116 చీరల అలంకరణతో అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ అలంకరణ ఆదివారం వరకు కొనసాగుతుందని, శ్రావణ మాసంలో ప్రతిరోజు విభిన్న అలంకరణలతో దర్శనం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ తెలిపారు.