ఖైరతాబాద్ గణేషుని దర్శనానికి పోటెత్తిన భక్తులు..ఆదివారం మధ్యాహ్నానికి లక్షమందిపైగా దర్శనం

ఖైరతాబాద్ గణేషుని దర్శనానికి పోటెత్తిన భక్తులు..ఆదివారం మధ్యాహ్నానికి లక్షమందిపైగా దర్శనం

హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేషుని దర్శంచుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం (ఆగస్టు31) సెలవు దినం కావడంతో గణేషుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. దర్శనానికి ఏర్పాటు చేసిన మూడు క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. బడా గణేషుని దర్శించుకునేందుకు  హైదరాబాద్ నగరంతోపాటు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చారు. 

మరోవైపు సెప్టెంబర్ 6 న ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన సమయం సమీపీస్తు్న్న కొద్దీ గణపయ్యను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ పెరుగుతోంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి కిలోమీటర్ వరకు బారులు తీరారు భక్తులు. భక్తుల రద్దీ పెరగడంతో క్రౌడ్ ను కంట్రోల్ చేసేందుకు, గణపయ్య దర్శనం సాఫీగా జరిగేలా  పోలీసులు భారీ బందోబస్తు చేశారు. 

ఖైరతాబాద్ గణేషుని దర్శనం కోసం వచ్చిన భక్తులతో రద్దీ పెరుగుతోంది. క్రౌడ్ ను కంట్రోల్ చేసేందుకు  పోలీసులు చర్యలు చేపట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిఘా పెట్టి రద్దీ కంట్రోల్ చేసేందుకు అధికారులకు సమాచారం ఇస్తున్నారు పోలీసులు. అడుగుడుగునా సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పై అధికారుల ఇంస్ట్రుక్షన్స్ తో ఎమర్జెన్సీ గేటు ఓపెన్ చేసి భక్తిలకు దర్శనం కల్పిస్తున్నారు పోలీసులు. 

మరోవైపు చైన్ స్నాచర్లు, జేబు దొంగలు, మొబైల్ ఫోన్స్ చోరీ, పిల్లలు తప్పిపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు తెలిపారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉదయం నుంచి భక్తుల కోలాహలం కొనసాగుతోంది. గంటగంటకు భక్తుల తాకిడి పెరుగుతోంది.  ఉదయం నుండి ఇప్పటి వరకు లక్షకు పైగా భక్తులు దర్శనం చేసుకున్నట్లు ఉత్సవ సమితి చెబుతోంది. ఈరోజు 3 లక్షలకు పైగా భక్తులు దర్శనం చేసుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు.