తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన ములుగు జిల్లా మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జాతర దగ్గర పడుతుండటంతో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. వీకెండ్ శనివారం కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. జంపన్న వాగు, సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణమంతా జన సందోహంగా మారింది. బెల్లం, చీర, సారా, పసుపు కుంకుమలతో తమ మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు.
జనవరి 19న జాతరను ప్రారంభించనున్న సీఎం..
సీఎం రేవంత్ రెడ్డికి మేడారం తల్లులంటే ఎంతో ప్రేమ అని.. 2010 నుంచి దర్శింకుంటున్నారు. మేడారంలో గద్దెల మార్పు, విస్తరణ ఏర్పాట్లను మొదలు పెట్టి.. పూర్తి చేసే వరకు ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటున్నారు. జనవరి 18న సీఎం మేడారం జాతరకు వస్తున్నారని.. రాత్రి అక్కడే బస చేసి 19న ఉదయం సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించి జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారు.
జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. మొదటి రోజైన జనవరి 28 బుధవారం రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారంలోని గద్దెలపైకి చేరుకోనున్నారు. 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న భక్తులు మొక్కులు సమర్పించనున్నారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లను తిరిగి వనప్రవేశం చేయడంతో మహా జాతర ముగియనుంది.
