వెంకన్న హుండీకి నిండుగా ఆదాయం

వెంకన్న హుండీకి నిండుగా ఆదాయం
  • ఏటా పెరుగుతున్న కానుకలు   
  • ఐదు నెలల్లో అన్నీ రికార్డులే   
  • 2018–19లో  రూ. 1,231 కోట్లు

తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే హుండీ కానుకలు, బంగారం, వెండి విరాళాలు ఏటా పెరుగుతున్నాయి. టీటీడీ అభివృద్ధి కోసం దాతలు సమర్పించే విరాళాలు కూడా రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లో శ్రీవారికి రెట్టింపు స్థాయిలో కానుకలు వచ్చాయి.

హుండీల్లో ఫుల్లు కానుకలు

తిరుమలేశుని హుండీల్లో  భక్తులు సమర్పిస్తున్న కానుకలు ఏటా పెరుగుతున్నాయి. నిత్యం తెల్లవారుజామున 3 గంటల నుంచి మొదలు.. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఏకాంతసేవ వరకు నాన్ స్టాప్ గా భక్తులతో శ్రీవారి ప్రాంగణం  కిక్కిరిసిపోతుంది. వాళ్లు హుండీలో వేసే కానుకలు రద్దీని బట్టి రోజూ 10 నుంచి 12 హుండీలు నిండిపోతున్నాయి. 2003 – 04 ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా రూ. 227 కోట్ల ఆదాయం రాగా.. 2018 – 19 నాటికి వెంకన్న హుండీ పైకం రూ. 1,231 కోట్లకు చేరుకుంది.

ఐదు నెలల్లో రూ. 500 కోట్ల వరకు ఆదాయం

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లో.. తిరుమల వెంకన్న హుండీ ఆదాయం రికార్డు కొట్టింది. కిందటేడాది ఇదే ఐదు నెలల్లో  రూ. 450.54 కోట్ల రూపాయలు లభించగా,  ఈ సారి రూ. 497.29 కోట్లు కానుకలు లభించాయి. 525 కిలోల బంగారం హుండీలో వచ్చింది. కిందటేడాది ఇదే 5 నెలల్లో 344 కేజీల బంగారం లభించింది. గత ఏడాది శ్రీవారి హుండీకి 1,128 కేజీల వెండి కానుకలు లభించగా,  ఈ సారి అత్యధికంగా  3,098 కేజీల వెండి హుండీలో లభించింది. టీటీడీ నిర్వహిస్తున్న 10 ట్రస్టులు, మరో పథకానికి నిరుడు  రూ. 114 కోట్ల విరాళాలు వచ్చాయి. ఈ ఏడాది  రూ. 141 కోట్లు విరాళంగా అందాయి. కోట్లాదిమంది ప్రజలకు స్వామివారిపై భక్తి శ్రద్ధలు ఉండటం వల్లనే ప్రతి సంవత్సరం శ్రీవారి హుండీ కానుకలు పెరుగుతున్నాయని, ఈ ఐదు నెలల్లో రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్తున్నారు.

భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి..

1945 ఏప్రిల్​ 10 న మొదటి సారి ఘాట్​రోడ్డు ఏర్పడిన తర్వాత టీటీడీ లెక్కల ప్రకారం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 1952 లో రోజుకు రెండువేలు, 1974 లో పూర్తిస్థాయి రెండో ఘాట్​రోడ్డు ఏర్పడిన నాటికి రోజుకు 8 వేలు, 1980 తర్వాత 15 వేలు, 1990 నాటికి 25 వేలు, 200‌‌‌‌0 నాటికి  40 వేలు, 2010 నాటికి రోజుకు 60 వేలకు చేరుకుంది. ఇలా..2010 ఏడాది మొత్తం వెంకన్నను దర్శించుకున్న వారి సంఖ్య 2.14 కోట్లు, 2011లో 2.43 కోట్లు, 2012 లో 2.73 కోట్లు, 2013 లో 1.96 కోట్లు( సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో కాస్త తగ్గింది), 2014 లో 2.26 కోట్లు, 2015 లో 2.42 కోట్లు,2016 లో 2.51 కోట్లు, 2017 లో 2.62 కోట్లు, 2018 లో 2.74 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.9 కోట్ల మంది స్వామివారిని దర్శించుకున్నారు.

ఆర్థిక సంవత్సరం                       ఆదాయం

                                          రూ.కోట్లలో

2003-04                              227

2004-05                             258

2005-06                             309

2006-07                             387

2007-08                            490

2008-09                            551

2009-10                           583

2010-11                           675

2011-12                         782

2012-13                          859

2013-14                       832

2014-15                       900 

2015- 16                    1010

2016-17                    1,110

2017-18                    1,156

2018-19                    1,231

Devotees offering Thirumala venkateswara donations, gifts are increasing annually