పూజలు, ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోవాలి

పూజలు, ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోవాలి

కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో భక్తులు ప్రార్థన మందిరాలకు వెళ్లకుండా ఇంట్లోనే ప్రార్థనలు, పూజలు చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  శుక్రవారం వివిధ మతాల పెద్దలతో సమావేశమైన మంత్రి..  మసీదులు, దేవాలయాలు, చర్చిలు, గురుద్వారా లో  ప్రార్థనల కోసం వచ్చే వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, కాబట్టి 2 వారాల పాటు పూజలు, ప్రార్థనలు ఆపేయాలన్నారు. అలాంటి ఆచారాలు అన్నింటిని ఇంట్లోనే పాటించాలన్నారు.

4 రోజుల క్రితం జరిగిన పరిణామాల వల్ల నగరం కరోనా వైరస్ ప్రభావానికి గురైందని తెలిపిన గంగుల..  ఇండోనేషియా నుంచి వచ్చిన ఆ మత ప్రచారకులు సంచరించిన  ప్రాంతాన్ని, వారు నమాజ్ చేసిన మసీదులను గుర్తించామన్నారు. అక్కడ వారు ఎవరిననైతే కలిశారో వారందర్నీ గుర్తించి  స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక్క కరీంనగర్ లోనే 8 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు కారణమవుతోందన్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు సాధ్యమైనంతవరకు ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు.

కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున ఎవరికి వారు స్వీయ నియంత్రణలో ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ కె.శశాంక.  ప్రజలు  బయటకు రాకుండా ఇండ్లలోనే ఉండాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా సహకరించాలని, తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు.

Devotees should pray and worship the god at home only: Minister Gangula kamalakar