ఆధ్యాత్మికం : మానవ  జాతికి చాణక్య నీతి.. జీవితం సుఖంగా సాగడానికి ఐదు సూత్రాలు ఇవే..!

ఆధ్యాత్మికం : మానవ  జాతికి చాణక్య నీతి.. జీవితం సుఖంగా సాగడానికి ఐదు సూత్రాలు ఇవే..!

మహాభారతంలో ‘విదురనీతి’ ద్వారా వ్యాసుడు మానవజాతికి నీతిమార్గాన్ని బోధించాడు. మౌర్య చంద్రగుప్తుడి దగ్గర మంత్రిగా పనిచేసిన చాణక్యుడు కూడా మానవజీవితం సుఖవంతంగా సాగడానికి ఐదు ముఖ్యమైన సూత్రాలను బోధించాడు.. నిర్ణయాత్మక శక్తి, ఆర్థిక నియంత్రణ, జ్ఞాన సంపాదన, సత్సంబంధాలు, విజయ మంత్రం.

ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేకపోతే గెలుపు సాధించడం కష్టమే. ఇందుకు ఉదాహరణ కౌరవులు, పాండవులు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు సహాయం కోసం దుర్యోధనుడు, అర్జునుడు ఇరువురూ ఒకేసారి శ్రీకృష్ణుని మందిరానికి చేరుకున్నారు. ఇద్దరూ తనకు కావలసినవారే. తాను ఇద్దరికీ సహాయపడతానని చెబుతూ, ‘ఒక పక్క నా సైన్యం ఉంటుంది, మరో పక్కన నేను ఉంటాను. నేను ఆయుధం పట్టను, మాట సహాయం మాత్రమే చేస్తాను’ అని పలికాడు. అప్పుడు అర్జునుడు.. శ్రీకృష్ణుడిని కోరుకున్నాడు. 

గోపాలక సైన్యాన్ని దుర్యోధనుడు తీసుకుంటూ మనసులో, ‘అర్జునుడు ఎంత వెర్రివాడు. ఇంత సైన్యాన్ని వదులుకుని, కేవలం మాట సహాయం చేస్తానన్న శ్రీకృష్ణుడిని ఎంచుకున్నాడు’ అనుకుంటూ సంబరపడ్డాడు. వాస్తవానికి అర్జునుడికి సరైన నిర్ణయాత్మక శక్తి ఉంది కనుకనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని, శ్రీకృష్ణుని సూచనలతో కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించగలిగాడు.

రెండవది ఆర్థిక నియంత్రణ. ఎంత సంపాదించినా, ‘కొండలైన కూలిపోవు కూర్చుని తింటే’ అన్న చందాన.. పెద్దలు సంపాదించిన సంపదలను విచ్చలవిడిగా ఖర్చుచేసి కష్టాలపాలైనవారు కోకొల్లలు. ధనం ఖర్చు చేసేటప్పుడు, ఏది అవసరం, ఏది అనవసరం అనే నియంత్రణ ఉండాలి. అది లేకపోతే చంచలమైన ధనం ఎంతోకాలం నిలబడదు. 

ఒక ఊళ్లో ఒక రైతు ఉన్నాడు. అతడికి ఇద్దరు కొడుకులు. ఆ రైతు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి, పైసాపైసా కూడబెట్టి.. ఆ ఆస్తిని ఇద్దరు పిల్లలకూ సమానంగా పంచాడు. పెద్ద కొడుకు... జాగ్రత్తగా ఖర్చుచేస్తూ, తండ్రి ఇచ్చిన ఆస్తిని రెట్టింపు చేశాడు. రెండో కొడుకు విచ్చలవిడిగా ఖర్చు చేసి అప్పులపాలయ్యాడు. పెద్ద కొడుకులో ఆర్థిక నియంత్రణ అనే గుణం ఉంది. చిన్న కొడుకులో ఆ గుణం కొరవడింది. చిన్న చిన్న అలవాట్లే మనిషిని పేదవానిగా మారుస్తాయి. అందువల్లే ఆ అలవాట్లను అదుపులో ఉంచుకోవాలని చాణక్యుడు సూచిస్తున్నాడు.

మూడవది జ్ఞాన సంపాదన. విద్య అనేది అత్యుత్తమ మిత్రుడు, విద్యావంతుడు ఎక్కడైనా గౌరవం పొందుతాడు. చేతిలో ధనం లేకపోయినా, విద్య ఉన్నవాడు ఎక్కడికైనా వెళ్లి ధనాన్ని సంపాదించగలుగుతాడని భర్తృహరి సుభాషితం చెబుతోంది.

‘‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము... విద్య నెఱుంగని వాడు మర్త్యుడే’’

విద్య దాచబడిన సంపద. మనిషికి అందం. విద్య కీర్తిని, భోగాలను కలిగిస్తుంది. విదేశాలలో విద్యే బంధువు. విద్యే గొప్ప దైవం. రాజులు కూడా విద్యనే పూజిస్తారు. విద్య లేనివాడు పశువుతో సమానం.  

నాలుగోది సత్సంబంధాలు. మంచివారితో సత్సంబంధాలు పెట్టుకోవాలని, త్రాచు పాము కంటే ప్రమాదకరమైన వ్యక్తులను దూరం పెట్టాలని చాణక్యుడు చెబుతున్నాడు. అంటే చెడు స్నేహాలకు, క్రూర స్వభావులకు దూరంగా ఉండమని అర్థం. ‘తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగినా, కల్లు తాగుతున్నాడనే అంటారు’ అన్న చందాన.. చెడ్డవారితో స్నేహం చేయటం వల్ల మంచివారిని కూడా చెడ్డవారిగానే పరిగణిస్తారు. అంతేకాదు.. అటువంటివారికి దూరంగా ఉండకపోతే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. 

రామాయణంలో శ్రీరామచంద్రుడు, భారతంలో పాండవులు... మంచివారితోనే మైత్రి చేశారు. ‘దుష్టులకు దూరంగా ఉండాలి’ అనే సామెత తెలిసిందే. పాండవులకు శ్రీకృష్ణుడే ప్రాణస్నేహితుడు. అతడి సదాలోచనల వల్లే పాండవులు విజయం సాధించినట్లు మహాభారతం చెబుతోంది. గుహుడు, జటాయువు, సంపాతి, సుగ్రీవుడు, విభీషణుడు... వంటి మంచి మిత్రులతో స్నేహం చేసిన రాముడు.. తన కష్టాలనన్నింటినీ అధిగమించగలిగాడు. ముఖ్యంగా సుగ్రీవునితో మైత్రి కారణంగా హనుమంతుడు లంకకు వెళ్లి, సీతమ్మ జాడను తెలుసుకుని వచ్చాడు. వానరుల సహాయంతో వారధి నిర్మించి, లంకకు చేరగలిగాడు శ్రీరామచంద్రుడు. మంచివారితో మైత్రి వలన కలిగిన లాభమది.

ఇక చివరగా విజయ మంత్రం.. గెలుపంటే శత్రువుని ఓడించడం మాత్రమే కాదు, సరైన ప్రణాళికతో ముందడుగు వేయడం.. అని చెబుతున్నాడు. ‘మీ బలాబలాలను, వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకూడదు’ అనే చాణక్యుడు చెప్పిన జ్ఞాన రహస్యం ఈ కాలానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
 - డా. పురాణపండ వైజయంతి-