కర్మ అనే పదం తరచుగా వింటూనే ఉంటాం. భగవద్గీతలో కర్మయోగం అనే అధ్యాయం కూడా ఉంది. కర్మ అనేది ఎవరూ అంచనా వేయలేనంత లోతుగా ఉంటుంది. కర్మ అంటే శాస్త్రీయంగా చెప్పబడినది అని అర్థం. అంటే అది శాస్త్రవిహితమైనదన్నమాట. అంటే హితాన్ని ఉపదేశించేది కర్మ అని అర్థం.
మనకు హితాన్ని ఉపదేశించేది వేదం. కనుక వేదమే శాస్త్రం, వేదమే కర్మ. ఎవరు ఏ నియమం ప్రకారం ఏ కర్మ చేయాలని వేదాలు వచించాయో దానినే కర్మ అంటారు. ఉదాహరణకి.. ఒక వ్యక్తి అజీర్ణ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి అజీర్ణం తగ్గడానికి ఉపయోగపడే ఔషధం ఇస్తారు.
అలాగే ఒక వ్యక్తికి ఆకలి అధికంగా ఉంది. అతడికి ఆకలి తగ్గించే ఔషధం ఇస్తారు. అప్పుడు ఆ ఔషధం పనిచేస్తుంది. అంతేకాని ఇద్దరికీ ఒకటే మందు ఇస్తే పరిణామం ఎలా ఉంటుందో తెలిసిందే. అలాగే కర్మలు కూడా ఎవరు చేయగలిగినవి వారు చేయాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
ఇక మరో విషయం
మనకు చెప్పిన పని చేయకపోవడం కూడా దోషమే. పంచతంత్రంలో గాడిద– కుక్క పరిశీలిద్దాం. ఒక రజకుడి దగ్గర గాడిద, కుక్క ఉన్నాయి. ఆ రజకుడు గాడిదకు ఎక్కువ ఆహారం ఇచ్చేవాడు. దానితో కుక్కకు కోపం వచ్చింది. తనకు తక్కువ ఆహారం ఇస్తున్నాడు కనుక తన పని తాను నిర్వర్తించకూడదు అనుకుంది.
ఒకనాడు రజకుడు బాగా అలసిపోయి వచ్చి పడుకున్నాడు. రాత్రి సమయంలో ఒక దొంగ రజకుడి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అది చూసిన గాడిద.. కుక్కతో, ‘దొంగవాడు మన యజమాని ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అన్నీ ఎత్తుకుపోతాడు. నువ్వు గట్టిగామొరగకుండా అలా చూస్తూ కూర్చుంటావేం’ అంది గాడిద. ‘నా ఇష్టం, నేను మొరగను’ అంటూ నిద్రపోయింది కుక్క.
గాడిదకు ఏం చేయాలో తోచలేదు. తెల్లారి లేచి.. జరిగిన దొంగతనం గుర్తించి రజకుడు లబోదిబోమంటూ నెత్తి మొత్తుకున్నాడు. వచ్చిన దొంగలు మొత్తం దోచుకుపోయారు అని గ్రహించి కుక్కను చితకబాదాడు. తన ఇంట్లో నుంచి గెంటేశాడు. కుక్క ఆకలికి మలమలమాడి చనిపోయింది. ఎవరు చేయవలసిన పని వారు చేయకపోవడం వల్ల కష్టాలపాలవ్వక తప్పదని ఈ కథ చెప్తోంది.
అదేవిధంగా కర్మలు కూడా ఎవరు చేయగలిగినవి వారు తప్పక చేయాలని భగవద్గీత చెప్తోంది.
‘యజ్ఞ కర్మ కంటె జ్ఞాన కర్మ గొప్పది’ అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ లోకంలో కర్మఫలాన్ని ఆశించేవారే ఇతర దేవతలను పూజిస్తారని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు.
శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్
జ్ఞాన యజ్ఞః పరంతప
సర్వం కర్మాఖిలం పార్థ
జ్ఞానే పరిసమాప్యతే
అర్జునా! ద్రవ్యమయమైన యజ్ఞం కంటె జ్ఞాన యజ్ఞం మిక్కిలి శ్రేష్ఠమైనది. కర్మలన్నీ జ్ఞానంతోనే పరిసమాప్తమవుతాయి.. అని శ్రీకృష్ణుడు (భగవద్గీతలోని నాలుగవదైన జ్ఞానకర్మసన్న్యాస యోగంలోని 33 వ శ్లోకం) చెప్తున్నాడు.
ద్రవ్యమయమైన యజ్ఞం కంటె జ్ఞాన యజ్ఞం ఉత్తమమైనది. ద్రవ్యంతో చేసే యజ్ఞాలకు ఆ ద్రవ్యాలు కేవలం సాధనాలు మాత్రమే. జ్ఞాన యజ్ఞంలో జ్ఞానమనేది ఫలితాన్ని అందించే సాధనం.
ఒక ఊరిలో ఒక సంపన్నుడు, ఒక పేదవాడు నివసించేవారు. ఆ పేదవాడు కుండలను తయారుచేస్తుండేవాడు. అతనికి ఆ పని మాత్రమే వచ్చు. నాణ్యంగా తయారుచేసిన ఆ కుండలను తక్కువ లాభానికి అమ్మేవాడు. ఆ లాభంతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఇతరులకు సాయపడుతూ ఉండేవాడు. ఆకలిగా ఉన్నవారు తన ఇంటికి ఎవరు వచ్చినా లేదనకుండా.. తనకు ఉన్నంతలో అన్నం పెట్టేవాడు.
సంపన్నుడు మాత్రం అధిక లాభాలకు అమ్ముతూ ఆ లాభంతో గొప్పగా బతికేవాడు. నిత్యం తన గొప్పదనం ప్రదర్శించేలా పూజలు చేస్తుండేవాడు. అందులో భక్తి కంటె, అహంకారం, దర్పం కనిపించేవి. ఆ పూజల సమయంలో.. వచ్చినవారందరిలో గొప్పవారికి ఒక రకం, బీదవారికి ఒక రకంగా అన్నం పెడుతూ, తనంత వాడు లేడని అహం ప్రదర్శించేవాడు.
పేదవాడు మాత్రం తాను కుడి చేత్తో చేసిన పనిని ఎడమ చేతికి తెలియనిచ్చేవాడు కాదు. కొంతకాలానికి ఆ ఇద్దరూ గతించారు. వారిలో పేదవాడికి మోక్షం లభించింది. సంపన్నుడు ఎన్నో దానాలు చేసినా అతడికి లభించలేదు. నిష్కామంగా చేసేవారు చరిత్రలో నిలిచిపోతారని ఈ కథ చెప్తోంది.
డా. పురాణపండ వైజయంతి
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు [email protected] కి మెయిల్ చేయండి.
