Dewald Brevis: బ్రెవిస్ ధనాధన్ సెంచరీ.. గైక్వాడ్, వాట్సన్, డుప్లెసిస్ రికార్డులు ఔట్

Dewald Brevis: బ్రెవిస్ ధనాధన్ సెంచరీ.. గైక్వాడ్, వాట్సన్, డుప్లెసిస్ రికార్డులు ఔట్

సౌతాఫ్రికా యువ క్రికెటర్ సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. ఇప్పటివరకు ప్రపంచ లీగ్ లో సత్తా చాటిన ఈ సఫారీ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా తనదైన మార్క్ వేస్తున్నాడు. మంగళవారం (ఆగస్టు 12) ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో సునామీ ఇన్నింగ్స్ తో విశ్వరూపం చూపించాడు. డార్విన్ వేదికగా మర్రారా క్రికెట్ గ్రౌండ్ లో కంగారూల బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా 56 బంతుల్లో 12 ఫోర్లు, 8సిక్సర్లతో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రెవిస్ ఇన్నింగ్స్ కు ఎన్నో రికార్డ్స్ తుడిచిపెట్టుకుపోయాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన సౌతాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు. 22 సంవత్సరాల 105 రోజుల వయసులో బ్రెవిస్ ఈ ఘనతను అందుకున్నాడు. అంతకముందు రిచర్డ్ లెవీ పేరిట ఉన్న రికార్డును (24 సంవత్సరాలు, 36 రోజులు) బద్దలు కొట్టాడు.

సౌతాఫ్రికా తరపున టీ20 క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (125) చేసిన ప్లేయర్ గా నిలిచాడు. 2015లో ఫాఫ్ డుప్లెసిస్ చేసిన 119 పరుగుల రికార్డ్ బద్దలు కొట్టాడు. 

ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోర్, అత్యధిక సిక్సర్లు (8) కొట్టిన ప్లేయర్ గా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై గైక్వాడ్ 123 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను బ్రెవిస్ బ్రేక్ చేశాడు.   

ఆస్ట్రేలియాపై టీ20 సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియాపై రుతురాజ్ గైక్వాడ్, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గుప్టిల్,తిలకరత్నే దిల్షాన్, షాయ్ హోప్ టీ20ల్లో సెంచరీలు బాదారు. 

ఆస్ట్రేలియాలో అత్యధిక వ్యక్తిగత టీ20 స్కోర్ చేసిన ప్లేయర్ గా బ్రెవిస్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2016లో ఇండియాపై షేన్ వాట్సన్124 చేసిన రికార్డ్ తుడిచి పెట్టుకుపోయింది. 

సౌతాఫ్రికా తరపున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 41 బంతుల్లోనే బ్రెవిస్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మిల్లర్ 2017లో బంగ్లాదేశ్ పై 35 బంతుల్లో చేసిన సెంచరీ టాప్ లో ఉంది. 

►ALSO READ | Tom Bruce: కివీస్ జట్టులో నో ఛాన్స్.. స్కాట్లాండ్ జట్టుకు ఆడనున్న న్యూజిలాండ్ క్రికెటర్