
అంతర్జాతీయ క్రికెట్ లో రెండు దేశాల తరపున ఆడిన వారి లిస్టులో మరొకరు చేర్చబడ్డారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ టామ్ బ్రూస్ ఇకపై స్కాట్లాండ్ దేశానికి ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆగస్టు 27 నుండి కెనడా లీగ్ లో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌లలో బ్రూస్ స్కాట్లాండ్ తరపున బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్ తరపున ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని ఈ కివీస్ బ్యాటర్ పనిలో పనిగా తన వన్డే అరంగేట్రం కూడా చేయబోతున్నాడు. స్కాట్లాండ్ లోని ఎడిన్‌బర్గ్‌లో జన్మించిన బ్రూస్.. 2016లో న్యూజిలాండ్‌కు వెళ్లే ముందు స్కాట్లాండ్ డెవలప్‌మెంట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
బ్రూస్ న్యూజిలాండ్ తరపున 17 టీ20 మ్యాచ్ లు ఆడి పెద్దగా రాణించలేకపోయాడు. 18.6 యావరేజ్.. 122.36 స్ట్రైక్ రేట్‌తో 279 పరుగులు మాత్రమే చేసి జట్టులో పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. వీటిలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చివరిసారిగా ఫిబ్రవరి 2020లో టీమిండియాతో అంతర్జాతీయ క్రికెట్ ,మ్యాచ్ ఆడాడు. ఐదు సంవత్సరాల తర్వాత స్కాట్లాండ్ జట్టుకు ఆడుతున్నట్టు తన నిర్ణయాన్ని తెలిపాడు. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ 2014 నుండి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. ఇటీవల బ్రూస్ గయానాలోని ప్రావిడెన్స్‌లో జరిగిన గ్లోబల్ సూపర్ లీగ్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
►ALSO READ | AUS vs SA: టీమిండియా రికార్డ్ సేఫ్.. ఆస్ట్రేలియా 9 వరుస విజయాలకు సౌతాఫ్రికా బ్రేక్
బ్రూస్ మాట్లాడుతూ.. "మా కుటుంబంలో స్కాటిష్ చరిత్ర ఎప్పటి నుంచో ఉంది. నేను ప్రపంచ వేదికపై స్కాట్లాండ్‌కు ఆడుతుండడంతో వారు చాలా గర్వపడతారని నాకు తెలుసు. ఐదు సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ తరపున ఆడటం నా అదృష్టం. ప్రపంచ క్రికెట్ లో నా ఆటను ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. స్కాట్లాండ్ జట్టు విజయం సాధించడంలో నా వంతు ప్రయత్నం చేస్తాను". అని బ్రూస్ క్రికెట్ స్కాట్లాండ్ ప్రకటనలో చెప్పుకొచ్చాడు. ఆగస్టు 29, సెప్టెంబర్ 6 మధ్య ఒంటారియోలో జరిగే నాలుగు మ్యాచ్‌లలో కెనడా, నమీబియాలతో స్కాట్లాండ్ తలపడనున్న మ్యాచ్ ల్లో బ్రూస్ బరిలోకి దిగనున్నాడు.