AUS vs SA: టీమిండియా రికార్డ్ సేఫ్.. ఆస్ట్రేలియా 9 వరుస విజయాలకు సౌతాఫ్రికా బ్రేక్

AUS vs SA: టీమిండియా రికార్డ్ సేఫ్.. ఆస్ట్రేలియా 9 వరుస విజయాలకు సౌతాఫ్రికా బ్రేక్

టీ20 క్రికెట్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది. పొట్టి ఫార్మాట్ లో వరుసగా 9 విజయాలు సాధించిన కంగారూలకు సఫారీలు చెక్ పెట్టారు.  మంగళవారం (ఆగస్టు 12) డార్విన్ వేదికగా మర్రారా క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  డెవాల్డ్ బ్రెవిస్ (56 బంతుల్లో 125*: 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ తో సౌతాఫ్రికాపై ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఆగస్టు 16 న జరుగుతుంది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సహచరులు విఫలమైనా డెవాల్డ్ బ్రెవిస్ (56 బంతుల్లో 125*: 12 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్కడే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి తన అంతర్జాతీయ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. స్టబ్స్ 31 పరుగులు చేసి రాణించగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్, మ్యాక్స్ వెల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హేజల్ వుడ్, జంపాలకు తలో వికెట్ దక్కింది. 

►ALSO READ | Shubman Gill: గిల్‌నే వరించిన ఐసీసీ అవార్డు.. స్టోక్స్, ట్రిపుల్ సెంచరీ వీరుడిని ఓడించిన టీమిండియా కెప్టెన్

భారీ ఛేజింగ్ లో ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం లభించినా ఆ తర్వాత తడబడింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే 17.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయింది. టిమ్ డేవిడ్ 24 బంతుల్లోనే 50 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మార్ష్ (22), వికెట్ కీపర్ క్యారీ (26) పర్వాలేదనిపించినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా, బాష్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. సెంచరీ హీరో బ్రెవిస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.   

ఈ  పరాజయంతో టీమిండియా రికార్డ్ సేఫ్ గా ఉంది. అసోసియేట్ దేశాలు కాకుండా టీ20 క్రికెట్ లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా 12 విజయాలతో టీమిండియా టాప్ లో ఉంది. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఓడిపోవడంతో 10 విజయాన్ని సాధించి భారత రికార్డును దగ్గరగా రావాలనే ఆస్ట్రేలియాకు బ్రేక్ పడింది.