41 బాల్స్‌‌లోనే వందతో విజృంభణ... బ్రెవిస్ రికార్డు సెంచరీ

41 బాల్స్‌‌లోనే వందతో విజృంభణ... బ్రెవిస్ రికార్డు సెంచరీ
  • రెండో టీ20లో సౌతాఫ్రికా గ్రాండ్‌‌ విక్టరీ

డార్విన్‌‌: సౌతాఫ్రికా యంగ్ సెన్సేషన్ డెవాల్డ్ బ్రెవిస్ (56 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 125 నాటౌట్‌‌) ఖతర్నాక్ సెంచరీతో చెలరేగాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌‌ను ఉతికేస్తూ  టీ20ల్లో సౌతాఫ్రికా తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ (41 బాల్స్‌‌)తో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరుతో రికార్డుకెక్కాడు. దాంతో శనివారం జరిగిన రెండో టీ20లో సఫారీ టీమ్‌‌ 53 రన్స్ తేడాతో ఆసీస్‌‌ను చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20  ఓవర్లలో 218/7 స్కోరు చేసింది. 

ఓపెనర్లు ఐడెన్ మార్‌‌‌‌క్రమ్ (18), ర్యాన్ రికెల్టన్ (14)తో పాటు లువాన్ ప్రిటోరియస్ (10) ఫెయిలైనా.. బ్రెవిస్‌‌ మాత్రం భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ట్రిస్టన్ స్టబ్స్ (31)తో కలిసి నాలుగో వికెట్‌‌కు 57 బాల్స్‌ లోనే 126 రన్స్ జోడించి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలో 41 బాల్స్‌‌లో  సెంచరీ అందుకున్న అతను 2023లో వెస్టిండీస్‌‌పై 43 బాల్స్‌‌లో వంద కొట్టిన డికాక్ ను అధిగమించాడు.  2017లో బంగ్లాదేశ్‌‌పై 35 బాల్స్‌‌లో డేవిడ్‌‌ మిల్లర్‌‌ సౌతాఫ్రికా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. టీ20ల్లో సెంచరీ అందుకున్న యంగెస్ట్ ప్లేయర్‌‌‌‌గానూ 22 ఏండ్ల 105 రోజుల బ్రెవిస్ ఘనత సాధించాడు. 

ఈ ఫార్మాట్‌‌లో అత్యధిక స్కోరు చేసిన సఫారీ ప్లేయర్‌‌‌‌గా ఫా డుప్లెసిస్ (2015లో వెస్టిండీస్‌‌పై 119) పేరిట ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేశాడు. అతని జోరుతో సఫారీ టీమ్‌‌.. ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు కూడా సాధించింది. అనంతరం భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కంగారూ టీమ్ 17.4 ఓవర్లలో 165 రన్స్‌‌కే ఆలౌటై ఓడిపోయింది. టిమ్ డేవిడ్ (24 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) ఒంటరి పోరాటం చేశాడు. సఫారీ బౌలర్లలో క్వెనా ఎంఫాక , కార్బిన్ బాష్  చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బ్రెవిస్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య చివరి, మూడో టీ20 శనివారం జరుగుతుంది.