
సౌతాఫ్రికా క్రికెట్ లో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ చెరగని ముద్ర వేశాడు. 13 ఏళ్ళ పాటు ప్రపంచ క్రికెట్ కు అసలైన విధ్వంసాన్ని చూపించాడు. ఫార్మాట్ కు తగ్గట్టుగా టెక్నీక్ మార్చుకొని ఆడే అతి కొద్ది మంది ఆటగాళ్లలో డివిలియర్స్ ఒకడు. ఇక వైట్ బాల్ ఫార్మాట్ కు వస్తే ఓ వైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు తన హిట్టింగ్ తో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తాడు. ప్రపంచమంతా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ఈ సఫారీ క్రికెటర్ 2018లోనే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. డివిలియర్స్ రిటైర్మెంట్ తర్వాత లాంటి ప్లేయర్ ఒకడు సౌతాఫ్రికాకు ఆశాజనకంలా మారాడు. అతడెవరో కాదు ప్రస్తుత క్రికెట్ లో సంచలన హిట్టింగ్ తో ఆకట్టుకుంటున్న డేవాల్డ్ బ్రెవిస్.
బ్రెవిస్ టీ20 అరంగేట్రం 2023 లోనే జరిగింది. ఆస్ట్రేలియాపై 20 ఏళ్ళ వయసులో టీ20 డెబ్యూ చేసినా ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 2025 బ్రెవిస్ అద్భుతంగా ఆడాడు. సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ తో పాటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున విధ్వంస క్రికెట్ ఆడాడు. ఈ ప్రదర్శనతో రెండేళ్ల తర్వాత మరోసారి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఇటీవలే జింబాబ్వే తో జరిగిన టెస్ట్ సిరీస్ లో స్థానం సంపాదించిన ఈ 22 ఏళ్ళ కుర్రాడు.. తాజాగా వన్డేల్లోనూ అరంగేట్రం చేయడం గమనార్హం. ఆస్ట్రేలియాపై మంగళవారం (ఆగస్టు 19) ప్రారంభమైన తొలి వన్డేలో బ్రెవిస్ కు తుది జట్టులో స్థానం దక్కింది.
22 ఏళ్ళ వయసులోనే బ్రేవీస్ మూడు ఫార్మాట్లు ఆడిన క్రికెటర్ గా నిలవడం ప్రస్తుతం క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది. మరో డివిలియర్స్ తమకు వచ్చాడని సౌతాఫ్రికా క్రికెట్ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో డివిలియర్స్ సైతం బ్రెవిస్ ను మిస్టర్ 360 అని చెప్పాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్ లో బ్రెవిస్ 37 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచ క్రికెట్ కు తనెంత ప్రమాదకారి అనే విషయాన్ని చెప్పాడు. మరి బ్రెవిస్ హవా క్రికెట్ లో ఎంతకాలం ఉంటుందో చూడాలి.