
- హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ వెల్లడి
- రాజ్ భవన్ హైస్కూల్లో డీ వార్మింగ్ డే కార్యక్రమం
- పాల్గొన్న మంత్రి పొన్నం..ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ పంపిణీ
పంజాగుట్ట, వెలుగు: ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం రాజ్ భవన్ ప్రభుత్వ హైస్కూల్ లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. దానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి దామోదర చీఫ్ గెస్టుగా అటెండ్ అయ్యారు. స్టూల్ స్టూడెంట్లకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు.
అనంతరం మంత్రి దామోదర మాట్లాడుతూ.. రక్తహీనత, నీరసం, చదువులో వెనకబడటం వంటి ప్రధాన లక్షణాలకు నులిపురుగులే ప్రధాన కారణమని తెలిపారు. నులిపురుగుల నిర్మూలనతోనే పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటాది రూపాయలు వెచ్చించి , అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని వివరించారు. ఈ సందర్భంగా నులిపురుగుల నివారణకు సంబంధించిన పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.
సిటీలో 11 లక్షల మందికి టాబ్లెట్స్
ఈ నెల 27వరకు హైదరాబాద్ లోని11 లక్షల 78వేల 118 మంది పిల్లలకు డీ వార్మింగ్ టాబ్లెట్స్ వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డీ వార్మింగ్ డే జరుపుకుంటున్నామని..తెలంగాణ భాషలో చెప్పాలంటే నట్టల మందు కార్యక్రమమన్నారు. పిల్లల శారీరక ఎదుగుదలకు డీ వార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు. పసిపిల్లల నుంచి19 ఏండ్ల వయసున్న వారందరూ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చని వివరించారు.
దీనికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం,హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్.చోంగ్తు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్,హైదరాబాద్ కలెక్టర్ అనుదిప్ దురశెట్టి తదితరులు పాల్గొన్నారు.