పోలీస్ వ్యవస్థ వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగదని సంచలన వ్యాఖ్యలు చేశారు డీజీ వీకే సింగ్ . జైలు డీజీ గా పనిచేసిన తనను ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్ గా నియమించడం బాధ కలిగించిందని అన్నారు. జైల్ డీజీ గా ఎన్నో సంస్కరణలు తెచ్చానని, జైల్లో అనేక నూతన మార్పులు తీసుకొచ్చానని వికే సింగ్ అన్నారు. తాను సెలవులో ఉన్నప్పుడు నన్ను స్టేషనరీ, ప్రింటింగ్, స్టోర్స్ కమిషనర్ గా బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను బదిలీ చేయడం తో చాలా మంది జైలు ఉద్యోగులు బాధపడ్డారని ఆయన అన్నారు. తన బదిలీలో రాజకీయ నేతల ప్రమేయం ఉందని, రాజకీయాలతో బంగారు తెలంగాణా రాదని అన్నారు.
పోలీస్ వ్యవస్థ ను మార్చడానికి తాను డిపార్ట్ మెంట్ కు రాలేదని, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే డిపార్ట్ మెంట్ కు వచ్చానన్నారు. పోలీస్ వ్యవస్థ లో మార్పులు అవసరమని ఆయన అన్నారు.
తానేమీ పదవుల కోసం పని చేయడం లేదని, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తానని వీకే సింగ్ అన్నారు. ప్రింటింగ్, స్టేషనరీ,స్టోర్స్ కమిషనర్ గా కొనసాగుతూ సాంఘిక సంక్షేమం కోసం పని చేస్తానని తెలిపారు. ప్రస్తుతం స్టేషనరీ,ప్రింటింగ్, స్టోర్స్ కు రూ.50 కోట్ల అప్పు ఉందని, రూ.2 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని ఆయన అన్నారు.
