అంతర్జాతీయ విమానాలపై జులై 31 వరకు నిషేధం

అంతర్జాతీయ విమానాలపై జులై 31 వరకు నిషేధం
  • కార్గో, డీజీసీఏ అనుమతి పొందిన వాటికి మినహాయింపు
  • వందే బారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పంద దేశాలకు మాత్రమే అనుమతి
  • 24 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న భారత్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై భారత్ వచ్చే జులై నెలాఖరు వరకు నిషేధాన్ని పొడిగించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సరుకులు రవాణా చేసే కార్గో విమానాలతోపాటు.. అత్యవసర పరిస్థితుల కోసం డీజీసీఏ నుంచి అనుమతి తీసుకున్న వాటికి మాత్రం నిషేధం నుండి మినహాయింపు ఉంటుంది.  భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ విషయాన్ని గమనించాలని డీజీసీఏ కోరింది. 
కరోనా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో కట్టడి చర్యల్లో భాగంగా వచ్చే నెల 31 వ తేదీ వరకు నిషేధం కొనసాగించాలని నిర్ణయించామని డీజీసీఏ స్పష్టం చేసింది. గత ఏడాది మార్చి 22న జనతా కర్ఫ్యూ సమయంలో మొదటి సారిగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. అయితే గత ఏడాది మేలో అన్ లాక్ ప్రక్రియ మొదలైన వెంటనే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ కింద అంతర్జాతీయ విమానాలను పరిమిత స్థాయిలో నడుపుతోంది. వీటితోపాటు అమెరికా, లండన్, సౌదీ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ తదితర 24 దేశాలతో ఎయిర్ బబుల్ తరహా ఒప్పందాలు చేసుకుని అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది.