
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో రానున్న రోజులే అత్యంత కీలకమని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. డబ్బు పంపిణీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున పటిష్ట నిఘా పెట్టాలని ఆదేశించారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ప్రస్తుత పరిస్థితులు, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సిబ్బందికి శుక్రవారం ఆడియో మెసేజ్ ద్వారా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్లలో ఉన్నతాధికారులు అంతా వారివారి పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను మరోసారి పరిశీలించాలని సూచించారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో స్థానిక ప్రజలతో కలిసి సమావేశాలు నిర్వహించాలన్నారు.
చెక్‌పోస్టుల వద్ద ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. డబ్బు పంపిణీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున పటిష్ట నిఘా పెట్టాలని డీజీపీ పోలీసులను ఆదేశించారు. పోలీసుల తనిఖీలకు సంబంధించిన వార్తలను మీడియాలో ప్రసారం అయ్యేలా చూసుకోవాలని సూచించారు. దీని వల్ల ఓటర్లలో విశ్వాసం పెరుగుతుందన్నారు. ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో గురువారం జరిగిన ఘటనను డీజీపీ గుర్తు చేశారు. నామినేషన్‌కు వెళ్తున్న సమయంలో బీఆర్‌ఎస్, -కాంగ్రెస్ వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో నలుగురు పోలీసులతోపాటు పలువురికి గాయాలు అయ్యాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రెండు రాజకీయపార్టీలు ఒకే చోటకు చేరకుండా జాగ్రత్త పడాలన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయడం నేర్చుకోవాలన్నారు.